Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ పాలన గిరిజన సంక్షేమానికి స్వర్ణయుగం.. - మంత్రి సత్యవతి రాథోడ్

తెలివితేటలు ఏ ఒక్కరికి సొంతం కాదని, అవకాశాన్ని అందిపుచ్చుకొని అందరితో పోటీ పడుతూ ఆకాశమే హద్దుగా నేడు గిరిజన విద్యార్థులు దూసుకుపోతున్నారని తెలిపారు.

సీఎం కేసీఆర్ పాలన గిరిజన సంక్షేమానికి స్వర్ణయుగం.. - మంత్రి సత్యవతి రాథోడ్
X

సీఎం కేసీఆర్ పాలన గిరిజన సంక్షేమానికి ఒక స్వర్ణయుగమని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు. గిరిజన గురుకులాలను మరింత బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన ఉత్సవాల సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ట్రైబల్ వెల్ఫేర్ ఐఐటీ స్టడీస్ సెంటర్ లో ఇటీవల ఐఐటి, ఎన్ఐటి, నీట్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు ల్యాప్ టాప్ లను మంత్రి అందజేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 91 గిరిజన గురుకుల విద్యాలయాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక 9 ఏండ్లలో మరో 94 ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తెలివితేటలు ఏ ఒక్కరికి సొంతం కాదని, అవకాశాన్ని అందిపుచ్చుకొని అందరితో పోటీ పడుతూ ఆకాశమే హద్దుగా నేడు గిరిజన విద్యార్థులు దూసుకుపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి నేడు విద్యార్థులు సాధించిన ర్యాంకులే ఉదాహరణ అని చెప్పారు.

అంతకు ముందు ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలకు ఇచ్చిన ప్రాధాన్యత వల్లే తమ భవిష్యత్తు మారిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రైవేటుకు దీటుగా గురుకులాల్లో విద్య అందుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో సీట్లు సాధిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన గురుకులాల కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌, అదనపు కార్యదర్శి సర్వేశ్వర్‌రెడ్డి, ఉప కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఓఎస్డీ రంగారెడ్డి, ప్రిన్సిపల్ సురేందర్, ఆర్సిఓ కళ్యాణి, ఐఏఎస్ స్టడీ సర్కిల్ ప్రిన్సిపల్ శారద, తదితరులు పాల్గొన్నారు.

First Published:  17 Jun 2023 9:46 PM IST
Next Story