Telugu Global
Telangana

తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 4.40 లక్షల మంది హజరవగా.. 86.60 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇందులో బాలురు 84.68 శాతం, బాలికలు 88.53 శాతంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు.

తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి
X

తెలంగాణ పదో తరగతి 2022-23 వార్షిక పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎన్సీఈఆర్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల సీడీని ఆమె విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ఎస్సెస్సీ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు 86.60 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి తెలిపారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 4.40 లక్షల మంది హజరవగా.. 86.60 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇందులో బాలురు 84.68 శాతం, బాలికలు 88.53 శాతంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. బాలుర కంటే బాలికలు 3.85 శాతం ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. టెన్త్ క్లాస్ ఫలితాల్లో 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. కేవలం 59.46 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

రాష్ట్రంలోని 2,793 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదయినట్లు మంత్రి సబిత వెల్లడించారు. ఇక 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని చెప్పారు. ప్రైవేట్ విద్యార్థులు 44.51 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఇందులో 43.06 శాతం మంది బాలురు, 47.73 శాతం మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు.

జూన్ 14 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాసైన విద్యార్థులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఫెయిలయ్యామని ఏ విద్యార్థి కూడా తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆమె సూచించారు. ఫెయిలయినా.. మరోసారి పరీక్ష రాయవచ్చని ఆమె సూచించారు. త్వరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తల్లిదండ్రులకు ఆవేదన మిగిల్చిన వారవుతారని మంత్రి చెప్పారు.

First Published:  10 May 2023 1:01 PM IST
Next Story