Telugu Global
Telangana

తెలంగాణ గవర్నమెంట్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గాయా..?

119 జ్యోతిబా పూలే పాఠశాలలను, 38 కేజీబీవీలను, 2 గిరిజన గురుకులాలను ఇంటర్మీడియట్ వరకు అప్‌ గ్రేడ్ చేశామన్నారు. వీటిలో కూడా అడ్మిషన్లు మొదలయ్యాయని చెప్పారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

తెలంగాణ గవర్నమెంట్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గాయా..?
X

తెలంగాణలో మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ వచ్చింది. అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ఓ దశలో అడ్మిషన్ కోసం రాజకీయ రికమండేషన్లు కూడా అవసరమయ్యాయి. మరి ఇంటర్ కాలేజీల పరిస్థితి ఏంటి..? ఐఐటీ ఆశతో తల్లిదండ్రులంతా పిల్లల్ని కార్పొరేట్ కాలేజీలకు పంపిస్తున్న దశలో తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గాయనే ప్రచారం మొదలైంది. ప్రభుత్వ కాలేజీలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయనే కథనాలు వచ్చాయి. వీటికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిందనే ఆరోపణల్ని మంత్రి సబిత ఖండించారు. ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి ఉచితంగా అందిస్తున్నామని, ప్రవేశాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారామె. 119 జ్యోతిబా పూలే పాఠశాలలను, 38 కేజీబీవీలను, 2 గిరిజన గురుకులాలను ఇంటర్మీడియట్ వరకు అప్‌ గ్రేడ్ చేశామన్నారు. వీటిలో కూడా అడ్మిషన్లు మొదలయ్యాయని చెప్పారు. ప్రవేశాల తుది గడువు ఇంకా పూర్తి కాలేదని, గడువు ముగిసే నాటికి అడ్మిషన్ల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది ఇంటర్ అడ్మిషన్లు అధికంగా నమోదవుతాయన్నారు. అయితే ఉత్తీర్ణతలో మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పోల్చి చూస్తే మారుమూల జిల్లాల్లోనే ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. దీనిపై దృష్టి పెట్టాలని హైదరాబాద్ పరిసరాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో కూడా ఉత్తీర్ణత శాతం పెరగాలని ఆమె అధికారులను ఆదేశించారు.

ఇంటర్మీడియట్ విద్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసినా పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షించాలని చెప్పారు. కాలేజీ నిర్వహణ అవసరాలు, ల్యాబ్‌ల ఆధునీకరణ పనుల కోసం మరో రూ.4.43 కోట్లు మంజూరు చేశామని చెప్పారు మంత్రి.

First Published:  19 July 2023 5:45 AM IST
Next Story