Telugu Global
Telangana

కొత్త సచివాలయంలో ద్వారలక్ష్మీ పూజ చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు ముందుగా ద్వారలక్ష్మీ పూజ చేశారు. అనంతరం యాగ క్రతువులో పాల్గొన్నారు.

కొత్త సచివాలయంలో ద్వారలక్ష్మీ పూజ చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
X

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయాన్ని ఇవ్వాళ సీఎం కేసీఆర్ ప్రారంభిచనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. సచివాలయ నిర్మాణాన్ని మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సింగిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. వేద పండితులు మొదటి సుదర్శన యాగంతో పూజలు మొదలు పెట్టారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు ముందుగా ద్వారలక్ష్మీ పూజ చేశారు. అనంతరం యాగ క్రతువులో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సుదర్శన యాగం తర్వాత చండీహోమం, వాస్తు హోమం నిర్వహించనున్నారు.

ఈ యాగాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1.20 గంటల నుంచి 1.32 మధ్య సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. కేవలం 12 నిమిషాల్లోనే ప్రారంభ కార్యక్రమం ముగించి.. సచివాలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలకు కేసీఆర్ రానున్నారు. ఆ తర్వాత వాస్తు పూజ మందిరానికి వెళ్లి పండితుల ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. అనంతరం సెక్రటేరియట్‌లోని ఆరో ఫ్లోర్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో కేసీఆర్ ఆసీనులవుతారు.

సీఎం కేసీఆర్ తన ఛాంబర్‌లో తొలి ఫైలుపై సంతకం చేసిన తర్వాత.. మంత్రులు తమకు కేటాయించిన ఛాంబర్లలో ఆసీనులై.. తొలి ఫైళ్లపై సంతకాలు చేస్తారు. ఆ తర్వాత అధికారులు తమ ఛాంబర్లకు వెళ్తారు. ఈ కార్యక్రమాలు అన్నీ ముగిసిన అనంతరం.. అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిచనున్నారు.


First Published:  30 April 2023 12:22 PM IST
Next Story