Telugu Global
Telangana

'గృహలక్ష్మి' డెడ్ లైన్.. కంగారు పడొద్దన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి

'గృహలక్ష్మి' విషయంలో ఆగస్ట్-10 డెడ్ లైన్ కావడంతో అందరూ హడావిడి పడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ పథకంపై క్లారిటీ ఇచ్చారు.

గృహలక్ష్మి డెడ్ లైన్.. కంగారు పడొద్దన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
X

నిరుపేదలు తమ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోడానికి తెంలగాణ ప్రభుత్వం రూ.3లక్షలు సాయం చేస్తోంది. 'గృహలక్ష్మి' పేరుతో ఈ పథకాన్ని తెరపైకితెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలమందికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దరఖాస్తు చేసుకోడానికి రేపే ఆఖరు. అయితే ఈ దఫా దరఖాస్తు చేసుకోకపోతే ఇక ఇళ్లు రాదేమో అని ఎవరూ ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 'గృహలక్ష్మి' అనే పథకాన్ని నిరంతరాయంగా అమలు చేస్తామన్నారు.

ఆమధ్య బీసీ బంధు విషయంలో కూడా ఇలాగే ప్రజలు హడావిడి పడ్డారు. సర్టిఫికెట్ల కోసం పడిగాపులు పడ్డారు. దరఖాస్తుకి చివరి రోజు చాలామంది ఆందోళన చెందారు. 'గృహలక్ష్మి' విషయంలో కూడా ఆగస్ట్-10 డెడ్ లైన్ కావడంతో అందరూ హడావిడి పడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ పథకంపై క్లారిటీ ఇచ్చారు. ఈ పథకం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని, ఈ పథకాన్ని నిరంతరాయంగా అమలు చేస్తామన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. గ్రామకంఠంలో ఉన్న పాత ఇళ్లు, స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవని, ఇంటి నంబర్ లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు. దరఖాస్తు గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైనవారు తమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ కు దరఖాస్తులు పంపించవచ్చని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3000 ఇళ్లు పూర్తయిన తర్వాత రెండో దశలో ఇచ్చే ‘గృహలక్ష్మి’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

First Published:  9 Aug 2023 4:03 PM IST
Next Story