ఎమ్మార్వోకు మంత్రి పొన్నం వార్నింగ్.. ఆడియో వైరల్
కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్యే కాదని, అధికార పార్టీకి చెందిన వ్యక్తి అంతకంటే కాదని అధికారితో చెప్పారు పొన్నం. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో అధికారులకే పూర్తి స్వేచ్ఛనిస్తున్నామంటూ ఫోన్‌కాల్‌లో చెప్పారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ ఎమ్మార్వోకు మంత్రి పొన్నం వార్నింగ్ ఇచ్చిన ఆడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కల్యాణలక్ష్మి చెక్కులను హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పంపిణీ చేయించొద్దని MROకు ఆదేశాలు జారీ చేశారు పొన్నం ప్రభాకర్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా ఒక్క లబ్ధిదారునికి కూడా కల్యాణలక్ష్మి చెక్కు అందిచొద్దన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కాల్ రికార్డింగ్ ఆడియో లీక్
— Telugu Scribe (@TeluguScribe) March 15, 2024
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కల్యాణలక్ష్మి చెక్కులు పంచనివ్వకండి అంటూ ఎమ్మార్వోకు ఆర్డర్ వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/rSFEYlPHfY
గతంలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఉంటే.. ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారని అధికారితో చెప్పారు పొన్నం. అయితే తమకు ప్రస్తుతం ఎమ్మెల్సీ లేడని.. పోటీ చేసి ఓడిన వ్యక్తి ప్రణవ్ ఉన్నాడని చెప్పారు. అధికారులే కల్యాణలక్ష్మి చెక్కులు పంచాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే స్థానిక సర్పంచ్ లేదా ఇతర ప్రతినిధులతో పంపిణీ చేయించాలన్నారు.
కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్యే కాదని, అధికార పార్టీకి చెందిన వ్యక్తి అంతకంటే కాదని అధికారితో చెప్పారు పొన్నం. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో అధికారులకే పూర్తి స్వేచ్ఛనిస్తున్నామంటూ ఫోన్‌కాల్‌లో చెప్పారు. ఇటీవల తరచుగా ప్రోటోకాల్ వివాదాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి పొన్నం ఆడియోకాల్‌తో ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వట్లేదన్న ఆరోపణలకు బలం చేకూరింది.