Telugu Global
Telangana

అవి రేషన్ బియ్యం.. రాములవారి అక్షింతలు కావు

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కూడా మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు.

అవి రేషన్ బియ్యం.. రాములవారి అక్షింతలు కావు
X

అయోధ్య శ్రీరాముడి ఆలయం నుంచి వచ్చిన అక్షింతలంటూ ఇంటింటికీ తిరిగి ఇటీవల బీజేపీ నేతలు పంచి పెట్టడం చూస్తూనే ఉన్నాం. అయితే అవి నిజమైన అక్షింతలు కావని, అయోధ్యనుంచి రాలేదని, అవి కేవలం రేషన్ బియ్యం అని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాముడి పేరుతో బీజేపీ మార్కెటింగ్ చేస్తోందని, రేషన్ బియ్యం తెచ్చి రాములోరి అక్షింతలంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లట్లేదని ఎక్కడా చెప్పలేదన్నారు పొన్నం. శాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ట పండితుల చేతుల మీదుగా జరుగుతుందని, అయోధ్య దేవాలయం నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే అశాస్త్రీయంగా ప్రారంభం జరుగుతోందని విమర్శించారు.

బండికి కౌంటర్..

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు అమ్ముడుపోతారంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కూడా మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. బండి‌సంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారని.. కనీసం జ్యోతిష్య శాస్త్రం కూడా ఆయన చదవలేదన్నారు. అవినీతి ఆరోపణల వల్లే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండిని తొలగించారన్నారు పొన్నం. బండి వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒకటేనని మరోసారి రుజువైందని చెప్పారు. అప్పట్లో ఎన్నికలకోసం మంగళ సూత్రాలు అమ్మానని చెప్పుకున్న బండి సంజయ్‌కి ఇప్పుడు లక్షల రూపాయలతో కటౌట్స్ పెట్టుకునే డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు పొన్నం. కరీంనగర్ పార్లమెంటుకు బండి‌సంజయ్ తెచ్చిన నిధులు శూన్యం అని ఆరోపించారు.

కరీంనగర్ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమతో పోటి పడేది ఎవరో మిగిలిన పార్టీలే తేల్చుకోవాలన్నారు. బండి‌సంజయ్, వినోద్ కుమార్ ఇద్దరికీ కరీంనగర్‌ లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటిలో అవినీతి జరిగితే బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పందించలేదని, ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు పొన్నం.

First Published:  14 Jan 2024 5:00 PM IST
Next Story