సాంప్రదాయ వ్యవసాయం నుంచి రైతాంగం బయటకు రావాలి- మంత్రి నిరంజన్ రెడ్డి
భారత్ వ్యవసాయ దేశమని, భవిష్యత్తులో ప్రపంచానికి ఆహారం అందించేంది మనదేశమేనన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహానిస్తుందని తెలిపారు.
వ్యవసాయం ఆధునిక పరిశ్రమగా వర్ధిల్లాలి అని, సాంప్రదాయ వ్యవసాయం నుంచి రైతాంగం బయటకు రావాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆ దిశగా అందరూ ఆలోచిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. హైదరాబాద్ లోని కన్హా శాంతివనంలో ‘సమున్నతి’ సంస్థ నిర్వహించిన ‘లైట్ హౌస్ కంక్లేవ్ ఎఫ్‌పీఓ 2023’ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత్ వ్యవసాయ దేశమని, భవిష్యత్తులో ప్రపంచానికి ఆహారం అందించేంది మనదేశమేనన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహానిస్తుందని తెలిపారు. రైతు ఉత్పత్తి దారుల సంఘాల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాధికులు, నిపుణులు వ్యవసాయం మీద మక్కువతో సాగు చేయడం సంతోషకరమైన విషయమని చెప్పారు.
‘సమున్నతి’ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని 180కి పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం అభినందనీయమన్నారు. రైతు ఉత్పత్తిదారుల విజయగాధలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, రైతులు ఉత్పత్తి చేసే పంటలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ చేయడం, రైతులకు లాభదాయకంగా మార్చడం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంపై సుదీర్ఘమైన చర్చ చేయడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో ‘సమున్నతి’ సంస్థ సీఈఓ అనిల్ కుమార్, డైరెక్టర్ ప్రవేశ్ శర్మ, డాక్టర్ వెంకటేష్ తగత్, ఏపీఎంఏఎస్ సీఈఓ సీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.