Telugu Global
Telangana

పాలమూరు ప్రాజెక్టుకు అడ్డు పుల్లలు వేసింది కాంగ్రెస్ పార్టీనే.. మంత్రి నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాల పాలనలో పాలమూరును భ్రట్టు పట్టించిందని మండిపడ్డారు.

పాలమూరు ప్రాజెక్టుకు అడ్డు పుల్లలు వేసింది కాంగ్రెస్ పార్టీనే..  మంత్రి నిరంజన్ రెడ్డి
X

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కాంగ్రెస్ చేసిన పాపాలే ఈనాడు శాపాలుగా మారాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. భట్టి పాలమూరు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఈ ఎత్తిపోతల పథకానికి అడ్డుపుల్లలు వేసింది కాంగ్రెస్ పార్టీనే అని దుయ్యబట్టారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమయ్యే నీటిని 263 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం నుంచి కాకుండా.. 6 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి తీసుకోవాలని పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. వందల కేసులు ఎదుర్కొని ఈ ప్రాజెక్టు పనులను తుది దశకు తీసుకొని వచ్చామని.. అసలు ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో భట్టి తెలుసుకొని మాట్లాడాలని మంత్రి నిరంజర్ రెడ్డి సూచించారు.

కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాల పాలనలో పాలమూరును భ్రట్టు పట్టించిందని మండిపడ్డారు. పాలమూరు వలసలకు, ఆకలి చావులకు కాంగ్రెస్ పార్టీనే కారణమని మంత్రి ఆరోపించారు. పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి, పాలమూరు పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను దశాబ్దాల పాటు సాగదీసింది కాంగ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే జూరాల నుంచి పూర్తి స్థాయిలో సాగు నీళ్లు అందుతున్నాయని మంత్రి గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని చెప్పారు. పాలమూరు గురించి, ఇక్కడి ప్రాజెక్టుల గురించి ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదని.. భట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మంత్రి నిరంజన్ రెడ్డి హితవు పలికారు.

First Published:  17 May 2023 8:16 PM IST
Next Story