Telugu Global
Telangana

కేసీఆర్ ని విమర్శించి బయటకెళ్లినవారెవరూ బాగుపడలేదు..

వారిద్దరూ పార్టీని బలహీన పరచాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. పునరాలోచన చేసుకుంటారని ఇన్ని రోజులు వేచి చూశామని, కానీ వారి ప్రవర్తన పార్టీకి నష్టం కలిగిస్తుందని తెలిసి ఇప్పుడు వేటు వేశామని వివరణ ఇచ్చారు.

కేసీఆర్ ని విమర్శించి బయటకెళ్లినవారెవరూ బాగుపడలేదు..
X

కేసీఆర్ ని విమర్శించి బయటకెళ్లినవారెవరూ విజయం సాధించలేదని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి పార్టీ చాలా అవకాశాలిచ్చిందన్నారు. కానీ వారి తీరు మారలేదని ధ్వజమెత్తారు. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తులకు తలొగ్గి బీఆర్ఎస్ ఎప్పటికీ ప్రవర్తించదన్నారు నిరంజన్ రెడ్డి. ఒకరిద్దరి కోసం పార్టీని పణంగా పెట్టబోమని చెప్పారు. ప్రతిపక్షాలు మాట్లాడే అంశాలే జూపల్లి, పొంగులేటి హైలెట్ చేస్తున్నారని, తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఇన్ని రోజులు పార్టీలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. వారిద్దరూ పార్టీని బలహీన పరచాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

కేసీఆర్ ని తిట్టినా..

ఏ ఒక్కరూ పార్టీని వదిలిపెట్టి వెళ్లకూడదనేదే కేసీఆర్ ఆలోచన అని.. తనని తిట్టిన వారిని కూడా రాష్ట్ర అవసరాల దృష్ట్యా పార్టీలో చేర్చుకున్న గొప్ప మనిషి ఆయన అని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. టీఆర్ఎస్ స్థాపించిన 11ఏళ్ళ తర్వాత జూపల్లి పార్టీలో చేరినా.. ఆయనకు తగిన ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని జూపల్లికి మంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు. జూపల్లికి సొంత ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం లేదని అన్నారు. పునరాలోచన చేసుకుంటారని ఇన్ని రోజులు వేచి చూశామని, కానీ వారి ప్రవర్తన పార్టీకి నష్టం కలిగిస్తుందని తెలిసి ఇప్పుడు వేటు వేశామని వివరణ ఇచ్చారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత పొంగులేటి పార్టీలో చేరారని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పొంగులేటి పార్టీలో ఏం చేశారో, ఆయనకు ఎందుకు అవకాశం రాలేదో ఖమ్మం ప్రజలకు తెలుసన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని కాదని రెబల్స్ ను పోటీ పెట్టారని మండిపడ్డారు. నిన్న మొన్న ఆంధ్ర నుంచి వచ్చి పార్టీ పెట్టిన వాళ్ళు విమర్శించినట్లు, పొంగులేటి, జూపల్లి.. కేసీఆర్ ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.

First Published:  10 April 2023 4:11 PM IST
Next Story