Telugu Global
Telangana

బండి సంజయ్ కి మంత్రి మల్లారెడ్డి సవాల్..

ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా పథకాలు చూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఏ రాష్ట్రానికి రమ్మంటే ఆ రాష్ట్రానికి వస్తానన్నారు మల్లారెడ్డి.

బండి సంజయ్ కి మంత్రి మల్లారెడ్డి సవాల్..
X

కేసీఆర్, కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ కి బీఆర్ఎస్ నుంచి గట్టి ఎదురుదాడి మొదలైంది. సీఎం కేసీఆర్ ని విమర్శించే స్థాయి బండి సంజయ్ కి ఎక్కడిదని ప్రశ్నించారు మంత్రి మల్లారెడ్డి. అభివృద్ధి గురించి మాట్లాడితే బీజేపీ నేతలు మొహం ఎక్కడ పెట్టుకుంటారన్నారు. అభివృద్ధిలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీ పడలేదన్నారు మల్లారెడ్డి. అభివృద్ధిలో తెలంగాణ వెనకపడిందని నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై, ఆయన కుటుంబ సభ్యులపై బండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, ఆయనకంత సీన్ లేదని అన్నారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో ఉన్నట్టుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా పథకాలు చూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఏ రాష్ట్రానికి రమ్మంటే ఆ రాష్ట్రానికి వస్తానన్నారు మల్లారెడ్డి. రైతులకు కేసీఆర్‌ ప్రభుత్వం చేసినంత మేలు ఇంకెవరూ చేయలేదన్నారు.

గతంలో బండి చేసిన డ్రగ్స్ ఆరోపణలపై ఇటీవల మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. మంత్రి సవాల్ ని స్వీకరించేందుకు వెనకాడిన బండి, ప్రజలకిచ్చిన హామీల సంగతి ఏమైందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆ తర్వాత చెప్పుతో కొట్టుకోడానికి, కొట్టించుకోడానికి తాను సిద్ధమని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. హామీల అమలులో తెలంగాణను వేలెత్తి చూపించే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఇంకే రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో తెలంగాణ తర్వాతేనని కుండబద్దలు కొట్టారు.

First Published:  23 Dec 2022 4:07 PM IST
Next Story