Telugu Global
Telangana

ఆ కేసినో నిర్వాహకుడి కారుపై MLA స్టిక్కర్ నాదే... మంత్రి మల్లారెడ్డి

కేసినో నిర్వాహకులు ప్రవీణ్ చీకోటి, మాధ‌వరెడ్డిల ఇళ్ళలో ఈడీ చేసిన సోదాల సందర్భంగా అధికారులకు మాధవరెడ్డి కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ కనిపించింది. అయితే అది తనదే అని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.

ఆ కేసినో నిర్వాహకుడి కారుపై MLA స్టిక్కర్ నాదే... మంత్రి మల్లారెడ్డి
X

గుడివాడ కేసినో వ్యవహారం హైదరాబాద్ చేరింది. ఈడీకి కొరకరాని కొయ్యగా మారింది. కేసినో రాజా చికోటి ప్రవీణ్ అతని స్నేహితుడు మాధవరెడ్డి ఈడీ వలయంలో చిక్కారు. హైదరాబాద్ బోయిన్ పల్లిలోని మాధవరెడ్డి ఇంటిలోనూ, కడ్తాల్ లోని ప్రవీణ్ ఇంటిలోనూ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో వీరి ల్యాప్ టాప్, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. మాధవరెడ్డి కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కారుమీద ఉండే ఎమ్మెల్యే స్టిక్కర్ కనబడడంతో ఆఫీసర్లకు షాక్ తగిలింది. అసలిది ఇక్కడ ఉండడమేమిటని ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన మల్లారెడ్డి ఆ స్టిక్కర్ నాదేనని, మూడు నెలల క్రితం పడేశానని చెబుతున్నారు. ఈ ఏడాది మార్చిలో దాన్ని ఎక్కడో పడేశారట.. మరి దాన్ని ప్రవీణ్, మాధవరెడ్డి చేజిక్కించుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆగస్టు 1 న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు వీరికి సమన్లు జారీ చేశారు. వీరి మనీ లాండరింగ్ పై ఇప్పటికే కేసు పెట్టిన ఈడీ అధికారులు, వీరి హవాలా లావాదేవీలపై కూడా ఇన్వెస్టిగేషన్ కి రెడీ అవుతున్నారు. ఈడీ ముందు అన్ని విషయాలూ చెబుతానని ప్రవీణ్ అంటున్నాడు. లీగల్ గా కూడా తాను ఫైట్ చేస్తానని చెబుతున్నాడు. ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ లోని విషయాలను ఈడీ విశ్లేషిస్తోంది.

నేపాల్ లో నిర్వహించిన కేసినోకి వీరిద్దరూ ప్రముఖులను స్పెషల్ విమానాల్లో తీసుకువెళ్ళారట. సుమారు 15 మంది పేకాటరాయుళ్లకు సినీ స్టార్స్ తో పరిచయం కల్పిస్తానని వారిని అక్కడికి తరలించారని వార్తలు వస్తున్నాయి. ప్రవీణ్, మాధవరెడ్డి నిర్వహించే కేసినోలో టేబుల్ బుక్ చేసుకోవాలంటే మినిమమ్ 25 లక్షలట.. ఆ మాత్రం ఉంటేనే అక్కడ ఎంట్రీ ఉంటుందట. వీరి కారుపై మల్లారెడ్డి స్టిక్కర్ ఉండడం మీద పోలీసులు, వీరి మనీలాండరింగ్, హవాలా లావాదేవీలపై ఈడీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.


First Published:  28 July 2022 2:39 PM IST
Next Story