Telugu Global
Telangana

బెంగళూరు వరదలపై కేటీఆర్ ఆలోచనాత్మక ట్వీట్లు..

బెంగళూరులో నివాసం ఉంటున్నవారు కూడా కామెడీ చేస్తూ వీడియోలు పంచుకుంటున్నారు. కానీ ఇక్కడ కావాల్సింది హాస్యం కాదని, ఆలోచన అంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

బెంగళూరు వరదలపై కేటీఆర్ ఆలోచనాత్మక ట్వీట్లు..
X

కర్నాటక వరదలతో బెంగళూరు అతలాకుతలం అయిపోతోంది. మహానగరం, వరద ధాటిని తట్టుకోలేకపోతోంది. రెండురోజులుగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంటిముందు పార్కింగ్ చేసిన కార్లు, బైక్ లు కొట్టుకుపోతున్నాయి. భారీ బిల్డింగ్ లు కుప్పకూలిపోతాయేమోనన్న భయం వెంటాడుతోంది. రోడ్లపక్కన చిన్న చిన్న ఆవాసాల్లో ఉన్నవారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ దశలో బెంగళూరుపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. బెంగళూరులో నివాసం ఉంటున్నవారు కూడా కామెడీ చేస్తూ వీడియోలు పంచుకుంటున్నారు. కానీ ఇక్కడ కావాల్సింది హాస్యం కాదని, ఆలోచన అంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ముందు ముందు ఇలాంటి దుర్భర పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవ‌డానికి ఇప్పటినుంచే ప్రణాళికలు రచించాలని చెబుతున్నారు.

నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులకు ఇబ్బంది ఉండదు. కానీ అది రోజురోజుకీ పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చలేదు. వాస్తవం చెప్పాలంటే భారత్ లో పల్లెలు పట్టణాలకు వలస వచ్చేస్తున్నాయి. స్థాయికి మించిన జనాభా, పట్టణాల్లో కాపురం ఉంటున్నారు. కిక్కిరిసిన జనాభా, వాహనాలు, నివాస స్థలాలుగా మారిపోతున్న ఖాళీ ప్రదేశాలు.. ఇలాంటి పరిణామాలతో ఏ చిన్న వర్షం కురిసినా డ్రైనేజీ వ్యవస్థ విఫలమై రోడ్లపైకి నీళ్లొచ్చేస్తున్నాయి. శిక్ష ప్రజలు అనుభవిస్తున్నారు కానీ, ఈ తప్పుకి బాధ్యులెవరు, పాలకులు ఏం చేయాలి..?

దేశ, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని నడిపించే ప్రాథమిక ఇంజిన్లు ఈ పట్టణాలు అని అన్నారు కేటీఆర్. వేగవంతమైన పట్టణీకరణ వల్ల, దానికి తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పించలేకపోవడంతో పట్టణాల్లో వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి దృశ్యాలు సహజం అని చెప్పారాయన. అదే సమయంలో కేంద్రం బాధ్యతను కూడా గుర్తు చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ వరుస ట్వీట్లు వేశారు. పట్టణాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన కోసం నిధులు సమకూర్చాలని సూచించారు. కేంద్రం సహకరిస్తే పట్టణాల్లో.. పరిశుభ్రమైన రోడ్లు, నీరు, గాలి, స్మార్ట్ వాటర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ని తయారు చేసుకోవడం కష్టసాధ్యం కాదన్నారాయన.

గతంలో హైదరాబాద్ వరదల సమయంలో కూడా కొంతమంది కర్నాటక నేతలు తమపై కామెంట్లు చేశారని, కానీ ఇప్పుడు బెంగళూరు వరదలపై తాను అలాంటి జోకులు వేయనని చెప్పారు కేటీఆర్. ఇలా స్పందించడం హైదరాబాద్ లోని స్నేహితులకు నచ్చదని కూడా అన్నారు. కానీ మనమంతా ఒకే దేశంగా ఎదగాలంటే, మనం ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకోవాలి, సమష్టి సంకల్ప శక్తిని చూపించాలి అని పిలుపునిచ్చారు. బెంగళూరు వరదల విషయంలో సోషల్ మీడియా ట్రోలింగ్ ని పక్కనపెట్టి ముందు కేంద్రం ఏం చేయాలనేదానిపై ఆలోచించాలన్నారు కేటీఆర్. పట్టణాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ముందడుగు వేస్తే.. రాష్ట్రాల తరపున తాము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

First Published:  6 Sept 2022 2:22 AM
Next Story