ప్రజలు అలిగినా ఓట్లు మాత్రం బీఆర్ఎస్ కే
రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదని, అలాగే సీఎం కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదని వివరించారు మంత్రి కేటీఆర్. పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేసిందని చెప్పారు.
నారాజైనా, అలిగినా, గులిగినా.. ప్రజలు తమ ఓట్లు మాత్రం కేసీఆర్ కే వేస్తామంటున్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ఇంటి మనిషి అని ప్రజలు అనుకుంటున్నారని, ఆయన్ను తమ ఇంటి పెద్దగా భావిస్తున్నారని, అందుకే ఆయనపై అలుగుతారని, అది సహజం అని చెప్పారు. కేసీఆర్ పై అలగకుండా.. ఇంకెవరిపై అలుగుతామని ప్రజలే ప్రశ్నిస్తున్నారని చెప్పారు. రాహుల్‌గాంధీ, మోదీ మీద అలుగుతామా? అని ప్రజలు అడుగుతున్నారన్నారు. తెలంగాణ భవన్ లో వరంగల్ కు చెందిన బీజేపీ నేతలు ఏనుగుల రాకేష్ రెడ్డి, మాదాసు వెంకటేష్, బక్కా నాగరాజు తదితరులు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరారు.
రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదని, అలాగే సీఎం కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదని వివరించారు మంత్రి కేటీఆర్. పదేళ్లుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో సేవ చేసిందని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కు ప్రతి అంగుళం తెలుసని చెప్పారు మంత్రి కేటీఆర్. ఒక బక్క పలచని వ్యక్తిని ఓడించేందుకు బీజేపీ నుంచి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, 15 మంది బీజేపీ ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్రమంత్రులు, వాళ్ల సామంతులు దిగుతున్నారని చెప్పారు. ఇటు కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య వంటి తీస్ మార్ ఖాన్లు వస్తున్నారని.. ఎంత మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చినా.. బీఆర్‌ఎస్ మాత్రం ప్రజలపైనే భారం వేసిందని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఢిల్లీ దొరలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని తేల్చి చెప్పారు కేటీఆర్.
వరంగల్ కు వరాలు..
వరంగల్ కు కూడా ఐటీ కంపెనీలు వచ్చాయని, మరిన్ని కంపెనీలు రావాల్సి ఉన్నదని అన్నారు కేటీఆర్. వచ్చే పదవీ కాలంలో వరంగల్ లో మెట్రో పరుగులు పెట్టిస్తానని, హామీ ఇచ్చారు. ఆ బాధ్యత తనదేనని చెప్పారు.