Telugu Global
Telangana

TSPSCని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం..

కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఓటుకు నోటు కేసులో చిక్కిన దొంగ అని.. అలాంటి దొంగ, అమరుల స్థూపం వద్దకు వ­చ్చి మద్యం పంచకుండా గెలుద్దాం, ప్రమాణాలు చేద్దాం రా.. అంటున్నాడని, నోట్లకట్టలతో పచ్చిగా దొరి­కిన దొంగ నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు కేటీఆర్.

TSPSCని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం..
X

డిసెంబర్‌ 3 తర్వాత TSPSCని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకుంటానన్నారు మంత్రి కేటీఆర్. సోషల్‌ మీడియా ద్వారా బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అదే వేదిక ద్వారా తిప్పికొట్టాలని, వాస్తవాలు ప్రచారం చేయాలని బీఆర్‌ఎస్వీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ ఏం చేశారని ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు సోషల్‌ మీడియా వేదికగా ధీటుగా సమాధానాలు ఇవ్వాలన్నారు.

కడుపులో గుద్ది.. నోట్లో పిప్పర్ మెంట్

గతంలో ప్రశ్నపత్రాలు లీక్‌ చేసింది బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ చెంచా కాదా? అని ప్రశ్నించారు కేటీఆర్. గ్రూప్‌–2 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది బండి సంజయ్, ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ అని గుర్తు చేశారు. పరీక్ష రద్దు చేస్తే తర్వాత గొడవ చేసింది కూడా వారేనని వివరించారు. కోర్టులో కేసు వేసి గ్రూప్‌–2 పరీక్ష రద్దు చేయించారని.. కడుపులో గుద్ది.. నోట్లో పిప్పర మెంట్‌ పెట్టేరకం వారు అని చెప్పారు. పరీక్షల నిర్వహణలో కొన్ని తప్పులు జరిగింది వాస్తవమేనని.. అందుకే TSPSCని పూర్తి స్థాయిలో ప్రక్షాళణ చేస్తామని చెప్పారు కేటీఆర్.

రాష్ట్రాన్ని కోఠీలో అమ్మేస్తారు జాగ్రత్త..

కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ఓటుకు నోటు కేసులో చిక్కిన దొంగ అని.. అలాంటి దొంగ, అమరుల స్థూపం వద్దకు వ­చ్చి మద్యం పంచకుండా గెలుద్దాం, ప్రమాణాలు చేద్దాం రా.. అంటున్నాడని, నోట్లకట్టలతో పచ్చిగా దొరి­కిన దొంగ నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్‌ వాళ్లే రేవంత్‌ రెడ్డిని రేటెంత రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన చేతికి అధికారమిస్తే రాష్ట్రాన్ని కోఠీలో చారణాకు అమ్మేస్తాడన్నారు. రాజకీయ యుద్ధంలో తమతో పోటీ పడుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఉద్యమ సమయంలో యువత, విద్యార్థుల చావులకు కారణమైందని, ఇప్పుడు ఓట్లు అడగటానికి వస్తోందని, కాంగ్రెస్ ని నమ్మి మోసపోవద్దన్నారు. రాబోయే నెల రోజులపాటు 33 జిల్లాల్లో విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణ అభివృద్దిపై చర్చ పెట్టాలన్నారు కేటీఆర్.

First Published:  30 Oct 2023 8:47 AM IST
Next Story