Telugu Global
Telangana

ఆటో యూనియన్లకు ప్రభుత్వ భవనం..

బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిందని అన్నారు మంత్రి కేటీఆర్. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి కానీ, కాంగ్రెస్‌ నిరుద్యోగులకు పదవుల మార్పు కాదని స్పష్టం చేశారు.

ఆటో యూనియన్లకు ప్రభుత్వ భవనం..
X

ఆటో డ్రైవర్లకు 100 కోట్ల రూపాయల మేర ప్రయోజనం కలిగించేలా ఇటీవల సీఎం కేసీఆర్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ల ఫీజు మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అటు యాదాద్రిపైకి కూడా ఆటోలకు అనుమతి ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ ఆటో కార్మికులు బీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞత తెలిపేందుకు మీటింగ్ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆటో యూనియన్లకు ప్రభుత్వం భవనం కట్టించి ఇస్తుందని హామీ ఇచ్చారు.


అది చెత్త బుట్టలో వేసేస్తారు..

కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోని చెత్త బుట్టలో వేసేస్తుందని అన్నారు మంత్రి కేటీఆర్. ఓట్ల కోసం, అలవికానీ హామీలు ఇస్తుందన్నారు. కాంగ్రెస్‌ సంస్థాగతంగా చేసుకున్న ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ ని కూడా చెత్త బుట్టలో పారేసిందన్నారు. కుటుంబానికి ఒక్క సీటు మాత్రమే ఇవ్వాలని వారు డిక్లరేషన్ రాసుకున్నారని.. కానీ దాన్ని వారే అతిక్రమించారని అన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వారి సతీమణి, కోమటిరెడ్డి బ్రదర్స్‌, వివేక్‌ బ్రదర్స్‌, మైనంపల్లి అండ్‌ సన్‌.. ఇలా అందరికీ టికెట్లు ఇచ్చి సొంత పార్టీలో చేసుకున్న డిక్లరేషన్‌ నే చిత్తు కాగితంలా పారేశారని విమర్శించారు. మేనిఫెస్టోని కూడా పారేయడం గ్యారెంటీ అన్నారు కేటీఆర్.

చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చేశాం..

మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చిందన్నారు మంత్రి కేటీఆర్. రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్‌ భగీరథ, కేసీఆర్‌ కిట్‌, దళితబంధు ఇలా అనేక పథకాలు చెప్పకపోయినా చేసిన మొగాడు సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి కానీ, కాంగ్రెస్‌ నిరుద్యోగులకు పదవుల మార్పు కాదని స్పష్టం చేశారు. కళ్ల ముందు జరిగిన మార్పును గమనించాలే కానీ, సోషల్‌ మీడియా సహా వివిధ మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న అసత్యాలను నమ్మకూడదని చెప్పారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కేటీఆర్.


First Published:  25 Nov 2023 9:26 AM IST
Next Story