మూసీ, ఈసీలపై 5 వంతెనలు.. నేడు కేటీఆర్ శంకుస్థాపన
ఐదు వంతెనలు 4 లేన్లతో 15 నెలలోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ఐదు వంతెనల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. హైదరాబాద్‌లో సుమారు 55 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా ఈసీ, మూసీ నదులపై నార్సింగి నుంచి గౌరెల్లి వరకు 5 కొత్త వంతెనలు నిర్మించేందుకు రెడీ అయింది. ఇందుకోసం హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ-HMDA రూ. 168 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు వంతెనలు 4 లేన్లతో 15 నెలలోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ఐదు వంతెనల నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ ప్లాన్‌లో భాగంగా ఈసీ నదిపై బుద్వేల్ ఐటీ పార్క్-1, 2 దగ్గర రెండు వంతెనలు, మూసీ నదిపై మంచిరేవుల దగ్గర ఓ వంతెన, ఉప్పల్ భగాయత్ HMDA లే అవుట్ దగ్గర మూసీ నదిపై నాలుగో వంతెన, ప్రతాప సింగారం దగ్గర ఐదో వంతెన నిర్మించనున్నారు.
మూసీ, ఈసీ నదులపై మొత్తం 14 వంతెనలు నిర్మించాలని ప్లాన్ చేయగా.. 5 బ్రిడ్జిలను HMDA నిర్మిస్తుంది. మిగతా 9 వంతెనల నిర్మాణ బాధ్యత GHMC తీసుకోనుంది. HMDA నిర్మిస్తున్న 5 వంతెనలకు ఇటీవలే టెండర్లను ఆహ్వానించారు అధికారులు. కొత్తగా నిర్మించే బ్రిడ్జిలు ఆకర్షణీయంగా ఉండేలా పలు డిజైన్‌లను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది.