Telugu Global
Telangana

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల కేటీఆర్ హర్షం

12 ఏళ్ళుగా కోర్టుల్లో పోరాడుతున్న తెలంగాణ జర్నలిస్టులకు సుప్రీం కోర్టు గుడ్ న్యూస్ వినిపించింది. జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్యను పరిష్కరిస్తూ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజు తీర్పునిచ్చారు. ఈ తీర్పు పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల కేటీఆర్ హర్షం
X

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించినందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. చాలాకాలంగా ఈ సమస్య పెండింగులో ఉందని ట్వీట్ చేసిన ఆయన.. దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమన్నారు. ఈ తీర్పు.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ప్రభుత్వ హామీకి ఎంతో దోహదపడుతుందన్నారు. హైదరాబాద్ లో తమకు హౌస్ సైట్స్ ఇప్పించాలని తెలంగాణ జర్నలిస్ట్ సొసైటీ డిమాండ్ చేస్తోందని, కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ హామీ నెరవేరుతుందని ఆయన అన్నారు. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను వారు స్వాధీనం చేసుకోవచ్చునని, ఇళ్ల నిర్మాణానికి పూనుకోవచ్చునని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని బెంచ్ గురువారం తీర్పునిచ్చింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయడానికి ఒక రోజు ముందు జస్టిస్ రమణ.. ఈ ఉత్తర్వులివ్వడం విశేషం. 12 ఏళ్ళ క్రితమే ప్రభుత్వం పాత్రికేయులకు ఇళ్ల స్థలాలను కేటాయించిందని, తాను ఐఏఎస్ లు, ఐపీఎస్ ల గురించి మాట్లాడడం లేదని. ఓ చిన్నపాటి జర్నలిస్ట్ గురించి మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. 'హైదరాబాద్ జర్నలిస్టులకు స్థలాన్ని కేటాయించారు.. కానీ అది అభివృద్ధి కాలేదు.. స్థలం కోసం వాళ్లంతా కలిసి రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారు.. ఇక వీరు తమ స్థలాలను స్వాధీనం చేసుకుని.. ఇళ్ళు కట్టుకోవచ్చు' అన్నారు. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎంపీలకు కేటాయించిన స్థలాల సమస్యను మరో బెంచ్ పరిశీలించాలని జస్టిస్ రమణ ఆదేశించారు.

First Published:  25 Aug 2022 11:35 AM GMT
Next Story