ఇండియాలో తెలివైన నేతలున్నా.. భవిష్యత్ తరాలపై దృష్టి పెట్టడం లేదు : మంత్రి కేటీఆర్
ఇంత పెద్ద దేశంలో ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక దగ్గర ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయని.. దీంతో రాజకీయ నాయకుల దృష్టంతా వాటిపైనే ఉంటోందని కేటీఆర్ అన్నారు.
ఇండియాలో ఎంతో మంది గొప్ప, తెలివైన నేతలు ఉన్నారని.. కానీ మెరగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలకు ఇంత కంటే మంచి భవితను అందించే అంశాలపై మాత్రం వారు దృష్టి పెట్టడం లేదని తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంత పెద్ద దేశంలో ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక దగ్గర ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయని.. దీంతో రాజకీయ నాయకుల దృష్టంతా వాటిపైనే ఉంటోందని అన్నారు. తాను ఏ ఒక్క నేతనో, రాజకీయ పార్టీనో అనడం లేదని.. నాతో సహా అందరికీ ఇది వర్తిస్తుందని చెప్పారు. ఇప్పుడు దేశంలో ఇదే పెద్ద సమస్యని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో హెచ్ఐసీసీలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 'డీకోడ్ ది ఫ్యూచర్' అనే అంశంపై ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం బుధవారమే బడ్జెట్ ప్రవేశపెట్టింది. అనేక రాష్ట్రాలు తమ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించాయి. కానీ ఆ ప్రతిపాదనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదని కేటీఆర్ విమర్శించారు. దేశ అభివృద్ధి కోసం కూడా కేటాయింపులు చేసినట్లు కనపడటం లేదని ఆయన అన్నారు. 1987లో సమాన జనాభా, జీడీపీని చైనా, ఇండియాలు కలిగి ఉన్నాయి. కానీ ఈ రోజు చైనా మనకు అందనంత ఎత్తులో ఉన్నది. అభివృద్ధిలో చైనా, జపాన్‌లు ఎంతో ముందంజలో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి, వేటినిపై దృష్టి సారించాలో ఆ రెండు దేశాలకు ఒక ప్రణాళిక ఉన్నదని కేటీఆర్ అన్నారు.
మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారింది. ఇందులో 60 శాతం మంది యువతే ఉన్నారు. ప్రపంచంలోని మరే దేశంలో ఇంత మంది యువత అందుబాటులో లేరు. అయితే, మన యువత ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తోంది తప్ప.. ఎవరూ మనమే ఎందుకు ఉద్యోగాలు కల్పించకూడదనే ఆలోచనలో లేరని కేటీఆర్ చెప్పారు. ఒక వైపు ప్రభుత్వాలు ఎన్నికల కోసం పని చేస్తుంటే.. యువత మాత్ర ఎవరు ఉద్యోగాలు ఎవరు సృష్టిస్తారా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. అసలు ఇలా వేచి చూడటం ఎందుకు.. మనమే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎందుకు ఎదగకూడదని ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మన దేశం నుంచి ప్రపంచం గుర్తించే స్థాయి బ్రాండ్స్ ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. చిన్న చిన్న దేశాలు కూడా అనేక ఆవిష్కరణలు చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. హైదరాబాద్ కంటే తక్కువ వైశాల్యం ఉండే సింగపూర్ ఇవాళ ఆర్థిక వ్యవస్థ విషయంలో ఎంతో వేగంగా దూసుకొని వెళ్తుందని గుర్తు చేశారు. మనం కూడా అలాంటి ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడే స్థాయికి ఎదగాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
ఇండియా అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని.. ఎనిమిదేళ్లుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకొని పోతున్నదని చెప్పారు. 4.6 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ చేరుకుందని మంత్రి వివరించారు. టీఎస్ఐ-పాస్ ద్వారా పదిహేను రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని.. ఒక వేళ 15 రోజులు దాటితే సదరు అధికారికి రోజుకు రూ.1000 చొప్పున పెనాల్టీ విధిస్తున్నట్లు చెప్పారు.
అమెజాన్‌కు చెందిన అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉంది. గూగుల్, ఉబర్ వంటి కంపెనీలకు అమెరికా తర్వాత ఇక్కడే అతిపెద్ద క్యాంపస్ ఉంది. హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా కూడా వెలుగొందుతుందని కేటీఆర్ వివరించారు. ఐటీ, అగ్రికల్చర్ రంగాల్లో ప్రతీ ఏడాది పెరుగుదల ఉందని చెప్పారు.
Minister @KTRBRS speaking at @NHRDN's 25th National Conference at HICC https://t.co/u91uDew9pG
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 2, 2023
IT and Industries Minister @KTRBRS attended @NHRDN's 25th National Conference at HICC and presented a plenary talk on the topic "Decoding the Economic Future: Hyderabad as Catalyst for 5T Economy." pic.twitter.com/K8beZ4BlAR
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 2, 2023