Telugu Global
Telangana

మంత్రి కేటీఆర్ తో స్వీడన్ రాయబారి, ఇన్వెస్టర్ల భేటీ.. - రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలపై సంతృప్తి

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ఆలోచనలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల గురించి వారికి తెలిపారు.

మంత్రి కేటీఆర్ తో స్వీడన్ రాయబారి, ఇన్వెస్టర్ల భేటీ.. - రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలపై సంతృప్తి
X

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు తమ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ ప్రాంతమని తెలిపారు. భారత్ లోని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ ఆధ్వర్యంలో ఆ దేశానికి చెందిన వ్యాపార ప్రతినిధులు, పలు కంపెనీల అధిపతులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు.

హైదరాబాద్ లో పెట్టుబడులపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ఆలోచనలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల గురించి వారికి తెలిపారు. టెక్నాలజీ, ఉత్ప‌త్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాల పట్ల స్వీడన్ కంపెనీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పారిశ్రామిక అనుకూల విధానాలను ప్రశంసించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 8 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నగరంలో వచ్చిన గణనీయ మార్పులు, మౌలిక వసతుల ఏర్పాటు వంటి వాటిని వారు ప్రస్తావించారు. తెలంగాణలో ఉన్న పారిశ్రామిక అనుకూల విధానాలతో మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు రప్పించేందుకు ప్రయత్నిస్తానని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్‌ చెప్పారు.

భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీల బృందంతో కలిసి పని చేసేందుకు ఇన్వెస్ట్ మెంట్ ఫెసిలిటేషన్ మెకానిజం పేరుతో తాము ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని జాన్ తెస్లెఫ్ తెలిపారు. ఇది స్వీడన్ వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలతోనూ కలిసి పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను తమ రాయబార కార్యాలయం నిరంతరం పరిశీలిస్తుందని.. ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకునే వారికి తమ సహాయ సహకారాలు అందిస్తామని స్వీడన్ రాయబారి చెప్పారు.

First Published:  3 May 2023 4:13 PM GMT
Next Story