సింగపూర్ సదస్సుతో తెలంగాణకు పెట్టుబడులు -కేటీఆర్
వరల్డ్ తెలంగాణ ఐటీ సదస్సు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ లోగోలను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సింగపూర్ లో జరగబోయే సదస్సు ద్వారా ఐటీ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు.
సింగపూర్ లో జరగబోయే వరల్డ్ తెలంగాణ ఐటీ సదస్సు (WTITC) సదస్సుతో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) సంయుక్త ఆధ్వర్యంలో సింగపూర్ లో ఈ సదస్సు జరగనుంది. దీనికి సంబంధించిన లోగోలను టిటా అధ్యక్ష కార్యదర్శులు సందీప్, వినయ్ తో కలసి మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐటీ రంగంలో ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందన్నారు. సింగపూర్ లో జరిగే ఈ సదస్సు ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వస్తాయని ఆకాంక్షించారు.
ఔత్సాహికులు పాల్గొనాలి..
టిటా దశాబ్ది వేడుకల్లో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో తెలంగాణ ఐటీ నిపుణులు, ఆవిష్కర్తలు, పరిశోధకులతో సింగపూర్ వేదికగా వరల్డ్ తెలంగాణ ఐటీ సదస్సు జరుగుతుంది. అగ్రిటెక్, ఫిన్ టెక్, ఎడ్యుటెక్, హెల్త్ టెక్ వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు, ఆయా రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఏర్పాట్లు చేస్తారు. డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ తీరుతెన్నులు తదితర అంశాలపై విశ్లేషణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు నిర్వాహకులు.
రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే సింగపూర్ సదస్సులో సాంకేతిక రంగానికి చెందిన ఔత్సాహికులు పాల్గొనాలని సూచించారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు, తెచ్చేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.