బయో ఆసియా సదస్సు లోగో ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్..
'అడ్వాన్సింగ్ ఫర్ వన్.. షేపింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్' అనే నినాదంతో బయో ఆసియా సదస్సు 20వ ఎడిషన్ హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. ఈ సదస్సుకి 70కి పైగా దేశాలనుంచి ప్రముఖులు హాజరవుతారని అంచనా.
2023 ఫిబ్రవరి 24 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు జరగబోతోంది. దీనికి సంబంధించిన లోగోను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'అడ్వాన్సింగ్ ఫర్ వన్.. షేపింగ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్' అనే నినాదంతో బయో ఆసియా సదస్సు 20వ ఎడిషన్ హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. ఈ సదస్సుకి 70కి పైగా దేశాలనుంచి ప్రముఖులు హాజరవుతారని అంచనా.
కొవిడ్ కారణంగా 2022లో బయో ఆసియా సదస్సుని హైదరాబాద్ కేంద్రంగా వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 37,500మంది ప్రముఖులు ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారు, తమ భావాలను పంచుకున్నారు. ప్రస్తుతం కొవిడ్ భయాలు తగ్గిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో సదస్సును భౌతికంగా నిర్వహించబోతున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ ఫోరం.. బయో ఆసియా. ఇప్పటి వరకు 19 సదస్సులు జరిగాయి. వచ్చే ఏడాది 20వ ఎడిషన్ కు హైదరాబాద్ సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సదస్సుకోసం వివిధ దేశాల ప్రతినిథులకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ప్రపంచం సాధారణ స్థితికి వచ్చిన పరిస్థితుల్లో ప్రపంచస్థాయి ప్రముఖుల సదస్సును హైదరాబాద్ లో నిర్వహించాలనుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. సమష్టి అవకాశాలపై పరిశోధకులతోపాటు, విద్యాసంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు చర్చించే ప్రపంచస్థాయి సదస్సుగా బయో ఆసియా గుర్తింపు పొందిందని అన్నారు. సదస్సు లోగోని ఆవిష్కరించిన ఆయన.. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.