Telugu Global
Telangana

కేటీఆర్ ఓపిక.. ఎవ్వర్నీ డిజప్పాయింట్ చేయలేదు..

ఈ ఏడాది తన పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.

కేటీఆర్ ఓపిక.. ఎవ్వర్నీ డిజప్పాయింట్ చేయలేదు..
X

పుట్టినరోజున కేటీఆర్ కాలి గాయంలో ఇల్లు కదలలేదు. అదే సమయంలో నాయకులు కూడా హడావిడి చేయొద్దని, ఆర్భాటాలకు పోవద్దని, కేక్ కటింగ్ లు ఇతర కార్యక్రమాలకు బదులు 'గిఫ్ట్ ఎ స్మైల్' పేరుతో వరద బాధితులకు సాయం చేయండని సూచించారు కేటీఆర్. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, ఆయన అభిమానులు 'గిఫ్ట్ ఎ స్మైల్' పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ట్విట్టర్లో కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలుపుతూ.. తాము చేపట్టిన కార్యక్రమాల ఫొటోలు ట్యాగ్ చేశారు. కేటీఆర్ ఏ ఒక్కరినీ డిజప్పాయింట్ చేయలేదు. చిన్న, పెద్ద తేడా లేకుండా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతూ ట్వీట్లు వేశారు.



స్కూల్స్ దత్తత, ఇళ్ల నిర్మాణం..

టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు 'గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమం పేరుతో కేటీఆర్ పుట్టినరోజున స్కూల్స్ దత్తత తీసుకున్నారు. మరికొందరు నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చారు. ఇంకొందరు వరద బాధితులకు సాయం చేశారు. కొంతమంది మొక్కలు నాటి కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు.

సినీరంగం నుంచి శుభాకాంక్షల వెల్లువ..

సినీ రంగం నుంచి దర్శకులు, నిర్మాతలు, టాప్ హీరోలు, హీరోయిన్లు కూడా కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. డైనమిక్ లీడర్ అంటూ హీరో చిరంజీవి, రామ్ చరణ్, రామ్, రవితేజ, సోనూ సూద్, నాని, ప్రకాష్ రాజ్, అడవి శేష్, మంచు లక్ష్మి, దేవిశ్రీ ప్రసాద్, థమన్, అనిల్ రావిపూడి, అనసూయ.. శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుభాకాంక్షలు తెలుపుతూ.. గొప్ప తండ్రికి పుట్టిన అంతకంటే గొప్ప తనయుడు అంటూ కేటీఆర్ ని ప్రశంసించారు.

ఏపీ నాయకులు కూడా..

కేటీఆర్ పుట్టినరోజున ఏపీ నాయకులు కూడా వరుస ట్వీట్లతో శుభాకాంక్షలు తెలిపారు. విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, రోజా, బాలినేని శ్రీనివాసులరెడ్డి, గంటా శ్రీనివాసరావు.. ఇలా పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.


మూడేళ్లుగా 'గిఫ్ట్ ఎ స్మైల్'

తన పుట్టినరోజు సందర్భంగా మూడేళ్ల క్రితం తాను 'గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు కేటీఆర్. ఆరోజు 6 అంబులెన్స్ లను తాను ప్రజలకు అంకితమిచ్చానని, తన తరపున టీఆర్ఎస్ నాయకులు, తన అభిమానులు, ఎమ్మెల్యేలు.. పేదలకోసం 120 ఉచిత అంబులెన్స్ లు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ ఏడాది తన పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.

First Published:  25 July 2022 6:03 AM
Next Story