టర్కీ భూకంపంపై కేటీఆర్ స్పందన.. ట్విట్టర్లో ఆవేదన
భూకంప దృశ్యాలు తనను తీవ్రంగా కలచి వేశాయని ట్వీట్ చేశారు. ఈ ఘటన మానవాళికి చాలా బాధాకరమని పేర్కొన్నారు. టర్కీ, సిరియా ప్రజలకు భగవంతుడు మరింత శక్తినివ్వాలని ప్రార్థించారు.
టర్కీ, సిరియాలో భూకంపం 4500మంది ప్రాణాలను బలి తీసుకుంది. వేలాదిమంది గాయాలతో ఆస్పత్రులపాలయ్యారు. మరింతమంది నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి దీన స్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప దృశ్యాలు తనను తీవ్రంగా కలచి వేశాయని ట్వీట్ చేశారు. ఈ ఘటన మానవాళికి చాలా బాధాకరమని పేర్కొన్నారు. టర్కీ, సిరియా ప్రజలకు భగవంతుడు మరింత శక్తినివ్వాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేటీఆర్..
Shocked to see the visuals of devastation in Turkey & Syria! Truly a very sad day for humanity
— KTR (@KTRBRS) February 7, 2023
Prayers for strength & wholehearted condolences to the bereaved families #TurkeyEarthquake
ఒక్క టర్కీలోనే 3వేల మందికి పైగా చనిపోగా, సిరియాలో సుమారు 1500 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 20 వేల మందికి గాయాలయ్యాయి. టర్కీలో సుమారు 15వేలమంది, సిరియాలో దాదాపు 4వేల మంది ప్రజలు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత భారీగా పెరగొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది.
టర్గీలోని గాజియాన్ తెప్ నగరానికి ఉత్తరాన 33 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తర్వాత దాదాపు 50 శక్తిమంతమైన ప్రకంపనలు రెండు దేశాలనూ వణికించాయి. టర్కీలో 36 లక్షల మంది సిరియన్ శరణార్థులు ఉన్నారు. వారి కారణంగా టర్కీలోని అనేక ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటోంది. బిల్డింగ్ లు బలహీనంగా ఉన్నా కూడా పేదరికం కారణంగా వాటిలోనే చాలామంది నివాసం ఉంటున్నారు. భూకంపం వచ్చిన తర్వాత కొన్ని భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద వేలాదిమంది ప్రాణాలు వదిలారు. ప్రపంచ దేశాలన్నీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసాయి. నాయకులు కూడా స్పందించారు. భారత్, టర్కీకి అండగా నిలబడేందుకు సిద్ధమైంది.