Telugu Global
Telangana

విద్యారంగంలో వలసలు వాపస్ -కేటీఆర్

మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 26 వేల పాఠశాలలకు సరికొత్త రూపురేఖలు వచ్చాయన్నారు కేటీఆర్.

విద్యారంగంలో వలసలు వాపస్ -కేటీఆర్
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యా దినోత్సవం నిర్వహించుకుంటున్న వేళ మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా గంభీరావుపేట, గోరంట్యాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల్ని ఆయన ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట పాఠశాల భవనాన్ని కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.


విద్యతోనే వికాసం, విద్యతోనే ఆత్మవిశ్వాసం అంటూ మంత్రి కేటీఆర్ తెలంగాణ విద్యాప్రగతి గురించి ట్వీట్ వేశారు. ప్రతి తరగతి గది.. తరగని విజ్ఞాన గని అని, తరగతి గది నాలుగుగోడలే.. దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలని వివరించారు కేటీఆర్. తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సరికొత్త విద్యా విప్లవం తీసుకొచ్చిందన్నారు. యావత్ దేశానికే పాఠాలు నేర్పుతోందని చెప్పారు. మిగతా రాష్ట్రాల్లో డ్రాప్-అవుట్ లు ఉంటే, తెలంగాణలో మాత్రం డ్రాప్-ఇన్ లు.. కనపడుతున్నాయని, ఒక్క ఏడాదిలోనే ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల వైపు లక్షమందికి పైగా విద్యార్థులు అడుగులు వేస్తున్నారని గుర్తు చేశారు. నవ తెలంగాణలో వ్యవసాయ రంగంలో వలసలు తగ్గిపోయాయని, అదే విధంగా విద్యారంగంలోనూ వలసలు వాపస్ అయ్యాయని చెప్పారు.


ఇదీ తెలంగాణ ఘనత..

దేశంలోనే అత్యధిక గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు మంత్రి కేటీఆర్. కార్పొరేట్ స్థాయి విద్య ఇక్కడ అందిస్తున్నామన్నారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షల వ్యయం చేస్తున్నామని.. దీన్ని భారం కాకుండా బాధ్యతగా తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు.

మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 26 వేల పాఠశాలలకు సరికొత్త రూపురేఖలు వచ్చాయన్నారు కేటీఆర్. సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నామని, ఇంగ్లిష్ మీడియం బోధనతో ఉన్నత ప్రమాణాలు నిర్దేశించామని చెప్పారు. భావితరాలకు బంగారు బాటలేసే ఈ మహాయజ్ఞంలో మేముసైతం అంటూ మనసుపెట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బందికి తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు, విద్యా దినోత్సవ శుభాభినందనలు తెలియజేశారు మంత్రి కేటీఆర్.

First Published:  20 Jun 2023 3:09 PM IST
Next Story