Telugu Global
Telangana

పవర్ లూమ్ క్లస్టర్ రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వండి మోదీజీ..

2023 కేంద్ర బడ్జెట్‌ లో మెగా పవర్‌ లూమ్ క్లస్టర్‌ మంజూరు చేయడం, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయడం.. ఇవే మీరు చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ లు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

పవర్ లూమ్ క్లస్టర్ రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వండి మోదీజీ..
X

మగ్గంపై నేసిన జీ-20 లోగోను తనకు పంపించిన తెలంగాణ చేనేత కార్మికుడు హరిప్రసాద్ ని ప్రధాని నరేంద్రమోదీ అభినందించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నేతన్నను అభినందించడంతో సరిపెట్టొద్దని, నేత కార్మికులందరి జీవితాల్లో వెలుగులు నింపే పని చేయాలని సూచించారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్ల నేత కార్మికులకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయడమే వారికి ప్రధాని ఇచ్చే బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ అని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్‌.

"ప్రియమైన నరేంద్రమోదీజీ.. సిరిసిల్లలోని చేనేత సోదరులు, సోదరీమణులకు ఉత్తమ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే.. 2023 కేంద్ర బడ్జెట్‌ లో మెగా పవర్‌ లూమ్ క్లస్టర్‌ మంజూరు చేయడం, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయడం. మీరు వీటికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాను" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


యునెస్కో అవార్డు.. కేటీఆర్ ప్రశంస..

గోల్కోండ కోటలోని మెట్ల బావి, కామారెడ్డిలోని దోమకొండ కోటకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు దక్కడంపై కూడా మంత్రి కేటీఆర్ స్పందించారు. అవార్డు రావడానికి కృషి చేసిన వారికి ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కి ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు తేవడం తమ నెక్స్ట్ టార్గెట్ అని అన్నారు కేటీఆర్.

First Published:  28 Nov 2022 2:28 PM IST
Next Story