Telugu Global
Telangana

ఆ ఘనత తెలంగాణకే.. కేటీఆర్ ట్వీట్

మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళలకోసం ఏకంగా వుమన్ ఎంటర్ ప్రెన్యూర్స్ హబ్(వి-హబ్) ఏర్పాటు చేసింది. పరిశ్రమల స్థాపనకు మహిళలు ముందుకొస్తే ప్రత్యేక రాయితీలు అందిస్తోంది.

ఆ ఘనత తెలంగాణకే.. కేటీఆర్ ట్వీట్
X

తలసరి ఆదాయంలోనే కాదు ఇంకా అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్-1గా ఉంది. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో తెలంగాణ దూసుకెళ్తోంది. వ్యాపార రంగంలో కూడా తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించడం విశేషం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME) రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలిచింది. తెలంగాణలో ఉన్న ఈ తరహా పరిశ్రమలలో ఏకంగా 40శాతం మంది మహిళలు అధినేతలుగా ఉండటం విశేషం. దేశంలో మరోఇతర రాష్ట్రంలోనూ ఈ సంఖ్యలో మహిళా పారిశ్రామిక వేత్తలు లేరు. MSME మహిళా అధినేతల గురించి చేపట్టిన సర్వేపై మంత్రి కేటీఆర్ ట్వీట్ వేశారు. మహిళా అధినేతల విషయంలో తెలంగాణ 'లీడర్' గా వెలుగొందుతోందని చెప్పారు.


తెలంగాణలో MSME రంగానికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలనిస్తోంది. కాప్రా, చర్లపల్లి తదితర నివాస ప్రాంతాల్లో అనేక సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు కొనసాగుతున్నాయి. అయితే ఈ తరహా పరిశ్రమలన్నిటికీ ఒకేచోట స్థానం కల్పించేందుకు మేడ్చల్‌ జిల్లాలోని ఘట్కేసర్‌ మండలం.. మాదారం గ్రామ పరిధిలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో MSME పార్క్‌ ను అభివృద్ధి చేస్తోంది. ఈ పార్క్‌ రెడీ అయితే ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుంది. 2 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రావచ్చునని అంచనా. ఇక MSME రంగంలో గణనీయమైన అభివృద్ధి కూడా గణాంకాల రూపంలో అందుబాటులో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2021-22లో కొత్తగా వచ్చిన పెట్టుబడులు 150 శాతం పెరిగినట్లు MSME ఎక్స్‌ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ నివేదికలో వెల్లడించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అనే సంస్థతో కలిసి MSME ఈపీసీ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. తెలంగాణలో 2020-21లో కొత్త పెట్టుబడులు రూ.31,271 కోట్లుగా ఉండగా.. 2021-22లో ఏకంగా రూ.76,568 కోట్లకు అవి పెరిగాయి. అంటే ఒక్క ఏడాదిలో 150 శాతం పెరుగుదల కనిపించింది.

ఇక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళలకోసం ఏకంగా వుమన్ ఎంటర్ ప్రెన్యూర్స్ హబ్(వి-హబ్) ఏర్పాటు చేసింది. పరిశ్రమల స్థాపనకు మహిళలు ముందుకొస్తే ప్రత్యేక రాయితీలు అందిస్తోంది. వి-హబ్ ఏర్పాటుని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కంత్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వ కృషిని మెచ్చుకున్నారు. ఈ ప్రోత్సాహం వల్లే ఇప్పుడు తెలంగాణ.. మహిళా పారిశ్రామిక వేత్తల విషయంలో దేశంలోనే నెంబర్-1 గా నిలిచింది. తెలంగాణలో MSME రంగంలో ఉన్న పారిశ్రామిక వేత్తల్లో 40శాతం మంది మహిళలు కాగా, ఆ తర్వాతి స్థానం పశ్చిమబెంగాల్(34శాతం)ది. ఇక దేశ సగటు కేవలం 20 శాతం కావడం గమనార్హం.

First Published:  31 Oct 2023 2:44 AM GMT
Next Story