కేసీఆర్ తోనే అది సాధ్యం.. కేటీఆర్ ట్వీట్
సమర్థుడైన నాయకుడు, స్థిరత్వం ఉన్న ప్రభుత్వం తోనే ఈ ఘనత తెలంగాణకు దక్కిందని చెప్పారు మంత్రి కేటీఆర్.
తెలంగాణలో పేదరికం భారీగా తగ్గిందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. ఇదంతా సీఎం కేసీఆర్ పాలన వల్లే సాధ్యమైందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సమర్థుడైన నాయకుడు, స్థిరత్వం ఉన్న ప్రభుత్వం తోనే ఈ ఘనత తెలంగాణకు దక్కిందని చెప్పారు.
2015-16లో తెలంగాణలో 13.18శాతం మంది పేదరికంలో ఉండగా.. 2019-21 నాటికి అది 5.88శాతానికి తగ్గినట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. భారత్ లో పేదరిక సూచీలో తెలంగాణ 21వ స్థానంలో నిలిచింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS - 5 (2019-20)) ఆధారంగా 12 ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకొని ‘‘జాతీయ మల్టీ డైమెన్షనల్ పేదరిక సూచీ - 2023’’ పేరిట ఓ నివేదికను నీతి ఆయోగ్ రూపొందించింది. NFHS -2015-16తో పోలుస్తూ ఈ నివేదిక రూపొందించారు.
It’s all about able leadership & stable governance
— KTR (@KTRBRS) July 19, 2023
Thanks to CM KCR Garu for making people of Telangana proud ✊ pic.twitter.com/BDhl67j4bx
రాష్ట్రాల వారీగా చూస్తే 33శాతం మంది పేదలతో బీహార్ రాష్ట్రం, దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో జార్ఖండ్(28.81 శాతం), మూడో స్థానంలో మేఘాలయ(27.79 శాతం), నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్(22.93 శాతం), ఐదో స్థానంలో మధ్యప్రదేశ్(20.63 శాతం) ఉన్నాయి. ఇక ఏపీలో 6.06 శాతం మంది పేదలు ఉండగా తెలంగాణలో పేదరికం శాతం గణనీయంగా 5.88 శాతానికి తగ్గింది.
2015-16తో పోల్చి చూస్తే 2019-20నాటికి తెలంగాణలో 27,61,201 మంది పేదరికం నుంచి విముక్తి పొందారని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2015-16లో తెలంగాణలో 13.18 శాతం జనాభా పేదరికంలో ఉండగా... 2019-20 నాటికి పేదరికం 5.88 శాతానికి తగ్గింది. ఐదేళ్లలోనే రాష్ట్రంలో 7.3 శాతం మేర జనాభా పేదరికం నుంచి విముక్తులయ్యారు. రాష్ట్రంలో పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రజల్లోనే ఎక్కువ పేదరికం ఉంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 7.51 శాతం జనాభా పేదరికంలో ఉంటే... పట్టణ ప్రాంతాల్లో 2.73 శాతం జనాభా పేదరికంలో ఉంది. అయితే, 2015-16తో పోల్చితే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది. 2015-16లో 19.51 శాతం గ్రామీణ జనాభా పేదరికంలో మగ్గితే... 2019-21 నాటికి పేదల శాతం 7.51 దగ్గర ఆగిపోయింది. జిల్లాలవారీగా చూస్తే కొమరం భీం జిల్లాలో పేదరికం ఎక్కువగా ఉండగా, పెద్దపల్లి జిల్లా పేదరిక నిర్మూలనలో ముందుంది. పెద్దపల్లి జిల్లాలో కేవలం 2.17 శాతం మంది మాత్రమే పేదలున్నారు.