తడి ఆరిన గొంతుల్లో గోదారి పరవళ్లు..
ఇంటింటికీ నీళ్లు ఇవ్వలేకపోతే, వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అని ధైర్యంగా చెప్పామని, ధీరోదాత్తమైన నాయకత్వానికి ఇది నిదర్శనం అని అన్నారు కేటీఆర్.
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు తెలంగాణలో ఊరూవాడా మంచినీళ్ల పండగ జరుగుతోంది. ఉమ్మడి పాలనలో ఎలాంటి అవస్థలున్నాయో, తెలంగాణ సాధించాక రాష్ట్ర జలజీవన ముఖ చిత్రం ఎలా మారిందో వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణలో నాడు నీటి కష్టాలు ఎలా ఉన్నాయి, నేడు వాటిని ఎలా అధిగమించామో వివరిస్తూ ట్వీట్ వేశారు.
నాడు గుక్కెడు తాగునీటి కోసం పుట్టెడు కష్టాలు పడ్డామని, ఖాళీబిందెలతో మహిళలు కిలోమీటర్ల ప్రయాణాలు చేసేవారని, వాటర్ ట్యాంకర్ల సాక్షిగా నీటియుద్ధాలు జరిగేవని, ఫ్లోరైడ్ భూతంతో నడుములు వంగిపోయి మనుషులు జీవచ్ఛవాలుగా మారారని, కలుషిత నీటితో సీజనల్ జ్వరాలు ప్రబలేవని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. నేడు సకల జనుల తాగునీటి కష్టాలను శాశ్వతంగా, సమూలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిందని చెప్పారు. సీఎం కేసిఆర్ సంకల్పబలం, మిషన్ భగీరథ అనే ఒకే ఒక్క మహాయజ్ఞంతో మంచినీటి కరువు తీరిపోయిందన్నారు. మిషన్ భగీరథను కేంద్రమే కాపీ కొట్టిందని, హర్ ఘర్ జల్ కు మనమే స్ఫూర్తి అని చెప్పారు కేటీఆర్.
నాడు
— KTR (@KTRBRS) June 18, 2023
గుక్కెడు తాగునీటి కోసం పుట్టెడు కష్టాలు
ఖాళీబిందెలతో కిలోమీటర్ల ప్రయాణాలు
వాటర్ ట్యాంకర్ల సాక్షిగా నీటియుద్ధాలు
ఫ్లోరైడ్ భూతంతో వంగిన నడుములు
జీవచ్ఛవాలుగా మారిన మనుషులు
చిలుముపట్టిన నీళ్లతో చెలగాటాలు
కలుషిత నీటితో సీజనల్ జ్వరాలు
ఒకటా.. రెండా..
సమైక్యపాలకుల పాపానికి..… pic.twitter.com/ZCbJMWagpQ
ఇంటింటికీ నీళ్లు ఇవ్వలేకపోతే, వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అని ధైర్యంగా చెప్పామని, ధీరోదాత్తమైన నాయకత్వానికి ఇది నిదర్శనం అని అన్నారు కేటీఆర్. పల్లెలు, పట్టణాలు, కొండ కోనల్లో.. తడి ఆరిన గొంతుల్లో గోదావరి పరవళ్లకు ఇది సజీవ సాక్ష్యం అన్నారు. నల్గొండ గుండెపై నుంచి ఫ్లోరైడ్ బండను తొమ్మిదేళ్లలోనే నిర్మూలించామని, దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించామన్నారు. బంజారాహిల్స్ వాసులు తాగే స్వచ్ఛమైన నీటినే, బస్తీల్లో నివసించే పేదలకు కూడా అందించామన్నారు. మంచినీటిని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించామని చెప్పారు కేటీఆర్.
తాగునీటి తండ్లాటను, ఆడబిడ్డల అష్టకష్టాలను తీర్చడంలో, ఉద్యమస్ఫూర్తితో కదంతొక్కిన ప్రతిఒక్కరికి దశాబ్ది ఉత్సవాల వేళ మంచినీళ్ల పండగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్.