Telugu Global
Telangana

దళితబంధు సక్సెస్ స్టోరీ చెప్పిన కేటీఆర్..

దళితబంధు పథకం వల్లే ఆ ఇద్దరు యువకులు డ్రైవర్ల నుంచి ఓనర్లుగా మారారు. నష్టంలేని వ్యాపారం చేస్తున్నారు. ఎస్బీఐ లోన్ ఇవ్వడం, టీఎస్ఆర్టీసీతో ఒప్పందం కుదరడంతో వారికి మరింత దన్ను దొరికింది.

దళితబంధు సక్సెస్ స్టోరీ చెప్పిన కేటీఆర్..
X

దళితబంధు పథకం నిరుపేద దళిత కుటుంబాల జీవన గమనాన్ని మార్చేస్తుందనేది వాస్తవం. అయినా ఈ పథకంపై కొంతమందికి అపోహలున్నాయి. దళితబంధు లబ్ధిదారుల ఎంపిక, నిధుల విడుదలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దళితబంధు విజయగాథలే ఈ విమర్శలకు అసలైన సమాధానం. అలాంటో ఓ సక్సెస్ స్టోరీని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రజలకు వివరించారు.



దళిత యువకులలో చాలామంది చదువుకున్నా సరైన ఉద్యోగం రాక వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. డ్రైవర్లు కూడా ఉన్నారు. అలాంటి ఇద్దరు డ్రైవర్ల విజయ గాథే ఇది. వేములవాడ నియోజకవర్గం చందుర్తి గ్రామానికి చెందిన రాగుల సాగర్, నేరెళ్ల శేఖర్ అనే ఇద్దరు దళిత యువకులు డ్రైవర్లుగా జీవనం సాగిస్తుండేవారు. సొంతగా ఏదైనా ప్రయత్నం చేద్దామన్నా ఆర్థిక అండ వారికి లేదు. ఇలాంటి సమయంలో దళితబంధు వారి జీవితంలో వెలుగు రేఖలు నింపింది. ఇద్దరు డ్రైవర్లను ఓనర్లుగా మార్చింది.

రాగుల సాగర్, నేరెళ్ల శేఖర్ కుటుంబాలకు దళిత బంధు మంజూరైంది. చెరి 10 లక్షలు చేర్చి బిజినెస్ చేద్దామనుకున్నారు. ఎస్బీఐ ద్వారా 22 లక్షల రూపాయల లోన్ లభించింది. డ్రైవింగ్ లో అనుభవం ఉంది కాబట్టి ఇద్దరూ కలసి ఓ బస్సు కొనుగోలు చేశారు. టీఎస్ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుని హయర్ బస్సుగా దాన్ని నడుపుతున్నారు. ఆ బస్సుకి వారిద్దరూ డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. తామే ఓనర్లుగా ఉంటూ డ్రైవర్లుగా పని కూడా చేస్తున్నారు. సిరిసిల్ల నుంచి వరంగల్ మధ్య ఈ బస్సు తిరుగుతోంది.

దళితబంధు అనే పథకం వల్లే ఆ ఇద్దరు యువకులు డ్రైవర్ల నుంచి ఓనర్లుగా మారారు. నష్టంలేని వ్యాపారం చేస్తున్నారు. ఎస్బీఐ లోన్ ఇవ్వడం, టీఎస్ఆర్టీసీతో ఒప్పందం కుదరడంతో వారికి మరింత దన్ను దొరికింది. దళితబంధు విజయగాథల్లో ఇది కూడా ఒకటి అని చెబుతున్నారు మంత్రి కేటీఆర్.

First Published:  7 July 2023 10:48 AM IST
Next Story