Telugu Global
Telangana

అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్.. ఈ సారి ఎందుకంటే..

తాజాగా మరోసారి కేటీఆర్ అమెరికాకు పయనం అవుతున్నారు. అయితే ఈ సారి ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం కానున్నది.

అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్.. ఈ సారి ఎందుకంటే..
X

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పలు మార్లు విదేశీ పర్యటనలు చేసిన కేటీఆర్.. రాష్ట్రానికి పెట్టుబడులు, కొత్త సంస్థలను తీసుకొని రావడంలో సఫలం అయ్యారు. ఇటీవల అమెరికాలో పర్యటించి పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా.. కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను ప్రపంచ వేదికపై చాటి చెప్పారు. ఇక తాజాగా మరోసారి కేటీఆర్ అమెరికాకు పయనం అవుతున్నారు. అయితే ఈ సారి ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం కానున్నది.

కేటీఆర్ కుమారుడు హిమాన్షును కాలేజీలో చేర్పించడానికి కుటుంబంతో పాటు యూఎస్ఏ వెళ్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్)లో తెలిపారు. వాస్తవానికి ఈ పర్యటనకు ముందుగానే వెళ్లాల్సి ఉన్నది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాపై సీఎం కేసీఆర్‌, పార్టీ సీనియర్లతో కసరత్తు చేశారు. ప్రస్తుతం జాబితా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తున్నది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తన బాధ్యత పూర్తి చేసిన కేటీఆర్.. ఇక కుమారుడిని కాలేజీలో చేర్పిండానికి అమెరికా పర్యటన ఖరారు చేసుకున్నారు. వారం రోజుల పాటు కేటీఆర్ కుటుంబంతో అమెరికాలో ఉండనున్నట్లు తెలిపారు.

కుమారుడు పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్తుండటంతో ఎక్స్‌లో భావోద్వేగభరిత పోస్టు పెట్టారు. 'తల్లిదండ్రులకు ఇలాంటి సందర్భం ఒకటి తప్పకుండా వస్తుంది. నిన్నటి వరకు చాలా అల్లరిగా, నాటీగా ఉన్న ఈ అబ్బాయి.. ఇప్పుడు ఎదిగిపోయాడు. ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవబోతున్నాడు. నాలోని ఒక భాగాన్ని తనతో పాటు తీసుకెళ్తున్నాడు. నాన్న బాధ్యత నెరవేర్చడానికి కుటుంబంతో కలిసి అమెరికా పయనం అవుతున్నాను. ఒక వారం పాటు అక్కడే ఉంటాను. అవసరమైతే అక్కడి నుంచే పని కూడా చేస్తాను' అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు.


First Published:  19 Aug 2023 5:07 PM GMT
Next Story