Telugu Global
Telangana

ఆగస్టు 9న నిజామాబాద్ ఐటీ టవర్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ కవిత

ఐటీ టవర్ కట్టడం అంటే ఒక భవనాన్ని నిర్మించడం మాత్రమే కాదు. ఇక్కడికి అంతర్జాతీయ స్థాయి సంస్థలను రప్పించడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమని కవిత అన్నారు.

ఆగస్టు 9న నిజామాబాద్ ఐటీ టవర్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్సీ కవిత
X

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం నిజామాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో ఉండే యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించడానికే ఐటీ టవర్ ఏర్పాటు చేస్తున్నట్ల కవిత తెలిపారు.

ఐటీ టవర్ కట్టడం అంటే ఒక భవనాన్ని నిర్మించడం మాత్రమే కాదు. ఇక్కడికి అంతర్జాతీయ స్థాయి సంస్థలను రప్పించడం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమని కవిత అన్నారు. ఇదే ప్రాధాన్యత అంశంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్‌లో ఐటీ టవర్ నిర్మించిందని కవిత వెల్లడించారు. ఈ టవర్‌లో 750 సీట్ల కెపాసిటీ ఉండబోతోంది. ఇందులో 100 సీట్లను తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)కు కేటాయిస్తున్నాము. ఐటీ టవర్స్‌లో ఉద్యోగాలకే కాకుండా ఇతర ప్రాంతాల్లోని ఐటీ ఉద్యోగాలకు టాస్క్ ఒక నోడల్ ఏజెన్సీగా పని చేస్తుందని కవిత చెప్పారు.

టాస్క్ సంస్థ ఐటీ టవర్స్ నిర్వహణ కోసం నిరంతరం పని చేస్తుంది. కంపెనీలను తీసుకొని రావడం.. యువతకు స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇవ్వడం దీని ప్రధాన కర్తవ్యం. ఇప్పటికే టాస్క్‌తో ఒప్పందం చేసుకున్న కంపెనీలు త్వరలోనే ఇక్కడ నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని చెప్పారు. ఐటీ టవర్స్‌లో ఉద్యోగం చేయాలనుకునే యువత టాస్క్‌ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కవిత సూచించారు. టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. కేవలం ఐటీ టవర్స్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోని ఐటీ సంస్థల్లో ఉన్న ఉద్యోగాలకు కూడా పంపిస్తుందని కవిత వెల్లడించారు.

నిజామాబాద్ ఐటీ టవర్స్‌లో కార్యకలాపాలకు 15 కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. వాటికి మిగిలిన 650 సీట్లు కేటాయించామని అన్నారు. త్వరలోనే నిజామాబాద్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. తప్పకుండా అందులో యువత పాల్గొనాలని కోరారు. నిజామాబాద్‌లో ప్రతీ నెల ఒక జాబ్ మేళా ఉంటుంది. ఈ నెల 29న జరిగే జాబ్ మేళాలో అర్హులైన యువత పాల్గొనాలని కోరారు.

First Published:  7 Aug 2023 9:24 PM IST
Next Story