Telugu Global
Telangana

నేడు దుర్గం చెరువు STP ప్రారంభం.. వంద శాతం సీవేజ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌..!

సిటీలో మొత్తం 1259 MLDల కెపాసిటీతో 31 STPలను మూడు ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్నారు. సిటీలో ఉత్పత్తయ్యే మురుగునీటిని 100 శాతం శుద్ధి చేసేందుకు ఈ STPలు ఉపయోగపడతాయి.

నేడు దుర్గం చెరువు STP ప్రారంభం.. వంద శాతం సీవేజ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌..!
X

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే వందశాతం మురుగునీరు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలపాలన్న లక్ష్యంతో ప్ర‌భుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఇవాళ దుర్గం చెరువు మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌-STPని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం HMDA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

హైదరాబాద్‌లో దాదాపు రూ.3,866 కోట్లతో 31 సీవరేజ్ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఆగ్నేయాసియాలో వందశాతం మురుగు రహిత నగరంగా హైదరబాద్‌ను తీర్చి దిద్దుతామన్నారు అధికారులు. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా మారిన దుర్గం చెరువు కలుషితం కాకుండా హైదరాబాద్‌ మెట్రో వాటర్ సప్ల‌య్‌ అండ్ సీవరేజ్ బోర్డు-HMWSSB ఏడు MLDల సామర్థ్యంతో ఈ ఎస్టీపీని నిర్మించింది. ఇప్పటికే అధికారులు ట్రయల్‌ రన్‌ పూర్తి చేశారు. ఇక దుర్గం చెరువు పరిసరాల్లో దుర్వాసన లేకుండా చేసేందుకు సువాసన వెదజల్లే ఆకాశమల్లి, మిల్లింగ్ టోనియా, మికేలియా చంపక లాంటి మొక్కలను పెంచుతున్నారు.

సిటీలో మొత్తం 1259 MLDల కెపాసిటీతో 31 STPలను మూడు ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్నారు. సిటీలో ఉత్పత్తయ్యే మురుగునీటిని 100 శాతం శుద్ధి చేసేందుకు ఈ STPలు ఉపయోగపడతాయి. ప్యాకేజీ-1లో అల్వాల్‌, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్‌ సర్కిల్‌.. ప్యాకేజీ-2లో రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్ సర్కిల్స్‌ను కవర్ చేస్తుంది. ఇక ప్యాకేజీ-3లో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి సర్కిళ్లలో 17 STPలను నిర్మిస్తున్నారు. కోకాపేటలో నిర్మించిన మొదటి STPని ఈ ఏడాది జూలై 1న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

First Published:  25 Sept 2023 2:13 PM IST
Next Story