Telugu Global
Telangana

కేంద్ర మంత్రి అమిత్ షాకు థ్యాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్

సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాల నియామక పరీక్ష పత్రాన్ని 13 స్థానిక భాషల్లో నిర్వహించాలని హోం శాఖ నిర్ణయించింది.

కేంద్ర మంత్రి అమిత్ షాకు థ్యాంక్స్ చెప్పిన మంత్రి కేటీఆర్.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాపై పలు విషయాల్లో ఎండగట్టే ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్.. తాజాగా థ్యాంక్స్ చెప్పారు. కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాల నియామక పరీక్ష పత్రాన్ని 13 స్థానిక భాషల్లో నిర్వహించాలని హోం శాఖ నిర్ణయించింది. ఇంగ్లీష్‌, హిందీతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో క్వశ్చన్ పేపర్ ఉండనున్నది.

కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని ప్రజలపై రుద్దుతోందని పలువురు సీఎంలు, మంత్రులు విమర్శిస్తున్నారు. స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హిందీని బలవంతంగా రుద్ద వద్దంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా గతంలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభించింది. ఇటీవల పెరుగు ప్యాకెట్లపై దహీ అని రాయాలనే నిబంధనపై కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ 13 స్థానిక భాషల్లో సీఆర్పీఎఫ్ పరీక్ష నిర్వహణకు సిద్ధపడుతోంది.

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 'సీఆర్పీఎఫ్ పరీక్షను తెలుగుతో పాటు 13 స్థానిక భాషల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నందుకు గాను.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నా ధన్యవాదాలు. ఇది వేలాది మంది తెలుగు మాట్లాడే రాష్ట్రాల అభ్యర్థులకు తప్పకుండా ఉపయోగపడుతుంది' ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


First Published:  15 April 2023 1:52 PM IST
Next Story