Telugu Global
Telangana

కామారెడ్డిలో కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన.. ఎందుకంటే..?

జిల్లా కేంద్రంలోని మాచారెడ్డి జెడ్పీటీసీ రాంరెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. రాంరెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ సుమారు గంటసేపు అక్కడే ఉన్నారు.

కామారెడ్డిలో కేటీఆర్‌ ఆకస్మిక పర్యటన.. ఎందుకంటే..?
X

సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్ తోపాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తుండటంతో.. ఆ రెండు నియోజకవర్గాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డిలో చీమ చిటుక్కుమన్నా అది వార్తే అవుతోంది. అలాంటిది.. బీఆర్ఎస్ నేతల మధ్య గొడవ జరగడంతో అది సంచలనం అయింది. దీంతో మంత్రి కేటీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కామారెడ్డిలో అకస్మాత్తుగా పర్యటించారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చారు.

అసలేం జరిగిందంటే..?

రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ కి చెందిన ఎంపీపీ, జడ్పీటీసీ మధ్య గొడవ రచ్చకెక్కింది. మాచారెడ్డి జడ్పీటీసీ రాంరెడ్డిపై అదే పార్టీకి చెందిన ఎంపీపీ నర్సింగ్ రావు దాడి చేశారు. నియోజకవర్గంలో స్థానిక నేతలు ప్రచారం చేసేందుకు కొన్ని గ్రామాలు వారికి కేటాయించారు. అలా రాంరెడ్డికి కేటాయించిన గ్రామంలో నర్సింగ్‌ రావు ప్రచారం చేస్తుండగా రాంరెడ్డి వర్గం అభ్యంతరం తెలిపింది. దీంతో నర్సింగ్ రావు, రాంరెడ్డిపై దాడి చేశారు. ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో మంత్రి కేటీఆర్.. పరిస్థితి చక్కదిద్దేందుకు అకస్మాత్తుగా కామారెడ్డిలో పర్యటించారు.

జిల్లా కేంద్రంలోని మాచారెడ్డి జెడ్పీటీసీ రాంరెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. రాంరెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ సుమారు గంటసేపు అక్కడే ఉన్నారు. జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో కూడా కేటీఆర్‌ చర్చలు జరిపారు. విబేధాలు పక్కనపెట్టి అధినేత కేసీఆర్‌ గెలుపు కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ని కలిశారు. ఈ నెల 9న కేసీఆర్‌ కామారెడ్డిలో నామినేషన్ వేసి అనంతరం ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారని.. ఆరోజున కేసీఆర్‌ ని వారు కలిసేలా ఏర్పాటు చేస్తానని రెడ్డి సంఘం ప్రతినిధులకు కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ గెలుపు బాధ్యత భుజానికెత్తుకున్నారు మంత్రి కేటీఆర్. భారీ మెజార్టీ వచ్చే విధంగా అక్కడ తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ కామారెడ్డికి వస్తే అక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో వివరిస్తున్నారు. భూముల విలువలు పెరుగుతాయని, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. అదే సమయంలో పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా సెట్ రైట్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్.

First Published:  6 Nov 2023 10:24 PM IST
Next Story