కామారెడ్డి కలెక్టర్‌కు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్
నిర్మలా సీతారామన్ ఆగ్రహంతో ఊగిపోతున్నా, అసందర్భంగా రంకెలేస్తున్నా కలెక్టర్ జితేష్ పాటిల్ సంయమనంతో వ్యవహరించారని మెచ్చుకున్నారు మంత్రి కేటీఆర్. కలెక్టర్ గౌరవప్రదమైన ప్రవర్తనకు ఆయన అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.
కామారెడ్డి జిల్లా బీర్కూట్ రేషన్ షాపు వద్ద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవర్తన తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు మంత్రి కేటీఆర్. ఆమె అలా ప్రవర్తించడం సరికాదని, అది న్యాయసమ్మతం కూడా కాదని చెప్పారు. కేంద్ర మంత్రి ప్రవర్తనతో ఐఏఎస్ అధికారులు కూడా భయపడుతున్నారని, వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని అన్నారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఇలాంటి రాజకీయ నేతలు నిరుత్సాహపరుస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్.
గతంలో కూడా నాయకులు తనిఖీలకు వెళ్లిన సందర్భంలో అధికారులపై చిందులు తొక్కిన ఉదాహరణలున్నాయి. కానీ ఇక్కడ ఏకపక్షంగా నిర్మలా సీతారామన్, కలెక్టర్ జితేష్ పాటిల్‌ని కార్నర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట వింటారా, కేంద్ర ప్రభుత్వంవైపు ఉంటారా అని ఆమె నిలదీశారు. మోదీ బొమ్మ పెట్టాలని, దానికి రక్షణగా ఉండాలని సూచించడం మరింత హాస్యాస్పదంగా మారింది. దీంతో కేంద్ర మంత్రి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. మంత్రి కేటీఆర్ కూడా నిర్మలా సీతారామన్ వ్యవహార శైలిపై మండిపడ్డారు.
నిర్మలా సీతారామన్ ఆగ్రహంతో ఊగిపోతున్నా, అసందర్భంగా రంకెలేస్తున్నా కలెక్టర్ జితేష్ పాటిల్ సంయమనంతో వ్యవహరించారని మెచ్చుకున్నారు మంత్రి కేటీఆర్. కలెక్టర్ గౌరవప్రదమైన ప్రవర్తనకు ఆయన అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. నిర్మలా సీతారామన్ ఎపిసోడ్‌పై ట్విట్టర్లో స్పందించిన మంత్రి కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేశారు. ఐఏఎస్ అధికారులతో కేంద్ర మంత్రుల ప్రవర్తన సరిగా లేదన్నారు.