దూకుడుగా మాట్లాడిన కేటీఆర్.. ఆచితూచి బుగ్గన వ్యాఖ్యలు
ఒకప్పుడు ఇండియా అంటే ఇందిరా.. ఇందిరా అంటే ఇండియా అన్నట్టుగా నడిచిందని ఇప్పుడు తిరిగి మోడీ పాలనలో అదే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రాబోయే కాలంలో కరెన్సీ నోట్లపై మోడీ బొమ్మ ముద్రించినా ఆశ్చర్యం లేదన్నారు.
దేశంలో అధ్యక్ష తరహా పాలన సాగుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. సౌత్ ఫస్ట్ పోర్టల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన దక్షిణ్ డైలాగ్స్ -2022 కార్యక్రమంలో కేటీఆర్, ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో సమాఖ్యస్ఫూర్తి కనిపించడం లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మేం ఇచ్చేవాళ్లం.. మీరు తీసుకునేవాళ్లు అన్నట్టుగా కేంద్రం తీరు ఉందని విమర్శించారు.
దక్షిణాది రాష్ట్రాలు దేశంలో 19 శాతం జనాభాను కలిగి ఉంటే.. ఈ రాష్ట్రాల నుంచి జాతీయ జీడీపీకి 35 శాతం వాటా సమకూరుతోందని వివరించారు. తెలంగాణ వజ్రోత్సవాలను కేంద్రం నిర్వహించాలనుకున్నప్పుడు ఆ విషయంపై రాష్ట్రంలో మాట్లాడాల్సి ఉండేదని.. అలా కాకుండా ఏకపక్షంగా ముందుకెళ్లడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. రాష్ట్రాల విషయంలో మేం మీకంటే పెద్దవాళ్లం.. మీరు మా కంటే చిన్నవాళ్లు అన్న తరహాలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉండడం అభ్యంతరకరమన్నారు.
ఒకప్పుడు ఇండియా అంటే ఇందిరా.. ఇందిరా అంటే ఇండియా అన్నట్టుగా నడిచిందని ఇప్పుడు తిరిగి మోడీ పాలనలో అదే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రాబోయే కాలంలో కరెన్సీ నోట్లపై మోడీ బొమ్మ ముద్రించినా ఆశ్చర్యం లేదన్నారు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వే లాంటివి మాత్రమే కేంద్రం చేతిలో ఉండాలని.. మిగిలిన వాటిని రాష్ట్రాల పరిధిలో ఉంచినప్పుడే దేశం పురోగమిస్తుందన్నారు.
తెలంగాణ కేంద్రానికి ఇచ్చే దాంట్లో తిరిగి 46 శాతం మాత్రమే రాష్ట్రానికి వస్తోందన్నారు. పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41 శాతం రావాల్సి ఉన్నా.. ఇప్పుడు మాత్రం 29 శాతం వస్తోందని కేటీఆర్ గుర్తు చేశారు. జీడీపీ అంటే గుజరాత్ డెవలప్మెంట్ ప్రోగ్రాంగా మార్చేశారని విమర్శించారు.
ఉత్తరాధి భారం దక్షిణాదిపై వేస్తున్నారు- థరూర్
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. ఉత్తరాధి రాష్ట్రాల సబ్సిడీ భారం దక్షిణాది రాష్ట్రాలపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నాటకలో సొంత రెవెన్యూ 72 శాతం ఉంటే.. బీహార్‌లో కేవలం 23 శాతం మాత్రమే ఉందని.. మిగిలిన డబ్బంతా బీహార్‌కు కేంద్రమే ఇస్తోందని గుర్తు చేశారు. ఇలా దక్షిణాది రాష్ట్రాల నుంచి డబ్బు తీసుకెళ్లి ఉత్తరాదిలో ఖర్చు చేస్తున్నారని థరూర్ విమర్శించారు. త్వరలో దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా దెబ్బ తగలబోతోందన్నారు. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేశాయని, అందువల్ల ఈ రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని.. 2026లో లోక్‌సభ స్థానాలను జనాభా ప్రతిపాదికన పునర్విభజన చేయబోతున్నారని.. దాని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ స్థానాలు తగ్గి రాజకీయంగా ప్రభావం తగ్గే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి ఇలాంటి సవాళ్ల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
పరోక్షంగా కేంద్రం పంథాను సమర్థించిన బుగ్గన
ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాత్రం కేంద్రాన్ని విమర్శించే విషయంలో ఆచితూచి మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందంటూనే.. రకరకాల కారణాల వల్ల దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన స్థితిలో ఉన్నాయని.. కాబట్టి పన్నుల వాటాలో కొంత మొత్తాన్ని దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలకు తరలించడంలో తప్పులేదన్నారు. 2026 తర్వాత దక్షిణాదిలో ఎంపీ స్థానాలు తగ్గే పరిస్థితి వస్తే ఈ ప్రాంత రాష్ట్రాలు కలిసికట్టుగా సమస్యను అధిగమించాలని బుగ్గన సలహా ఇచ్చారు. కేంద్రాన్ని ప్రశ్నించే ముందు అసలు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు వాటి అధికారాలను ఏమేరకు ఇస్తున్నాయో కూడా ఆలోచన చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా బుగ్గన మాట్లాడారు.