Telugu Global
Telangana

15 రోజుల్లో 32 నియోజకవర్గాల్లో తిరిగా.. ప్రజల మూడ్ ఎలా ఉందంటే..?

ఎన్నిక‌లు రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. కొత్త అంగీ లాగు కుట్టించుకుంటారని, లాల్చీ పైజామాలు కొనుక్కుంటారని.. ఇళ్లకు సున్నాలు వేసుకుంటార‌ని సెటైర్లు పేల్చారు మంత్రి కేటీఆర్.

15 రోజుల్లో 32 నియోజకవర్గాల్లో తిరిగా.. ప్రజల మూడ్ ఎలా ఉందంటే..?
X

గ‌త 15 రోజుల్లో తాను 32 నుంచి 33 నియోజ‌క‌వ‌ర్గాల్లో పర్యటించానని.. తెలంగాణ‌లోని నాలుగు మూలలు తిరిగానని ప్రజల మూడ్ స్పష్టంగా తెలిసిందని చెప్పారు మంత్రి కేటీఆర్. తొమ్మిదిన్నరేళ్లు ఒకేపార్టీ పాలన ఉందంటే ఎక్కడో ఓచోట కాస్త వ్యతిరేకత ఉంటుందని, కానీ తెలంగాణ ప్ర‌జ‌ల నుంచి ఏమాత్రం అస‌హ‌నం వ్య‌క్తం కావ‌ట్లేదన్నారాయన. ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేక‌త క‌న‌పడ‌క‌పోగా, కేసీఆర్ తిరిగి ముఖ్య‌మంత్రి అయితేనే పేద‌లు, రైతులు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల వారు బాగుంటార‌ని ప్ర‌జ‌లు ఆలోచిస్తున్నారని చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన చేరికల సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బిల్యా నాయక్ సహా మరికొందరు నేతల్ని ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.


కేసీఆర్‌తో మాత్ర‌మే గిరిజ‌నుల‌కు న్యాయం జ‌రుగుతుందనే భరోసాతో బిల్యా నాయక్ బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ తండాల‌ను గ్రామ పంచాయ‌తీలుగా మార్చారని, 30 వేల మంది గిరిజ‌న బిడ్డ‌లు.. వార్డు మెంబ‌ర్ల నుంచి స‌ర్పంచ్‌ ల వ‌ర‌కు ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎదిగారని గుర్తు చేశారు. ఫ్లోరోసిస్‌ ను రూపుమాపిన నాయ‌కుడు కేసీఆర్ మాత్ర‌మే అని చెప్పారు. దేవరకొండ నియోజకవర్గంలో ర‌వీంద్ర నాయ‌క్, బిల్యా నాయ‌క్ కలసి పనిచేయాలని సూచించారు. ఈసారి మెజార్టీ 60వేలు దాటాలని దిశా నిర్దేశం చేశారు.

ఆ గడ్డం ఉందో పీకిందో..

ఎన్నిక‌లు రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. కొత్త అంగీ లాగు కుట్టించుకుంటారని, లాల్చీ పైజామాలు కొనుక్కుంటారని.. ఇళ్లకు సున్నాలు వేసుకుంటార‌ని సెటైర్లు పేల్చారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నాయకులంతా సీఎం కుర్చీకోసం పోటీపడతారని, మీడియాలో కూడా ఫేక్ సర్వేలు సృష్టిస్తారని అన్నారు. గ‌మ్మ‌తైన డైలాగులు, ఊద‌ర‌గొట్టే ఉప‌న్యాసాలిస్తారని చెప్పారు. 2018లో కేసీఆర్ ని ఓడించాకే గడ్డం తీస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం చేశారని.. ఆ గ‌డ్డం ఉందో పీకిందో తెలియ‌దన్నారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సన్నాసి రేవంత్ రెడ్డి కూడా తిరిగి పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదారేళ్ల క్రితం ఓటుకు నోటు.. ఇప్పుడేమో సీటుకు నోటు అంటూ రేవంత్ రెడ్డిపై సెటైర్లు పేల్చారు కేటీఆర్.

First Published:  11 Oct 2023 8:17 PM IST
Next Story