ఆ గొంతును, శక్తిని వృథా కానివ్వం.. కేటీఆర్ హామీ
ఉద్యమకారులకు, విద్యార్థి ఉద్యమ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసిందని.. ఇంకా చేయాలని దరువు ఎల్లన్న కోరారని.. ఆయన సూచన కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామన్నారు కేటీఆర్.
విద్యార్థి ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన్నను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్ కు భరోసా ఇచ్చారు కేటీఆర్. ఎల్లన్నకు సముచిత గౌరవం ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నట్టు తెలిపారు. "నీ గొంతును, శక్తిని వృథా కానివ్వం. తప్పకుండా నీ సేవలను బ్రహ్మాండగా ఉపయోగించుకుంటాం. నీకు వయసు, అనుభవం, చిత్తశుద్ధి ఉంది. ఉద్యమంలో పని చేసిన ఘనమైన నేపథ్యం ఉంది. నీ భవిష్యత్తుకి నాదీ హామీ.." అని ఎల్లన్నకు మాటిచ్చారు.
అవకాశాలిచ్చి ప్రోత్సహించాం..
బీఆర్ఎస్ పార్టీ మొదటినుంచీ ఉద్యమ నాయకులను ప్రోత్సహించిందని చెప్పారు మంత్రి కేటీఆర్. ఉద్యమకారులకు, విద్యార్థి నాయకులకు కొంతమేర పార్టీ న్యాయం చేసిందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు కూడా అవకాశం కల్పించామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలుగా కూడా ఉద్యమ నాయకులు ఉన్నారని ఆ అవకాశం బీఆర్ఎస్ తోనే సాధ్యమైందని చెప్పారు. కళాకారులు, ఉద్యోగ సంఘాల నాయకులకు న్యాయం చేసే ప్రయత్నం చేశామన్నారు.
బాల్క సుమన్ ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ విప్‌గా ఉన్నారని గుర్తు చేశారు కేటీఆర్. గ్యాదరి కిషోర్ ఎమ్మెల్యే అయ్యారని, బొంతు రామ్మోహన్ మేయర్ గా పనిచేశారని చెప్పారు. ఎర్రోళ్ల శ్రీనివాస్, క్రిశాంక్, దూదిమెట్ల బాలరాజు, డాక్టర్ ఆంజనేయ గౌడ్ వంటి వారిని కార్పొరేషన్ల చైర్మన్ లుగా నియమించామని చెప్పారు. కళాకారులకు కూడా సముచిత గౌరవం ఇచ్చామని చెప్పారు. రసమయి బాలకిషన్ ను బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అయ్యారని, సాంస్కృతి సారథి చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారని.. గోరెటి వెంకన్నను ఎమ్మెల్సీగా నియమించామని చెప్పారు. ఉద్యమంలో కష్టపడ్డ కళాకారులందర్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేలు అమలు చేస్తున్నామని వివరించారు. గాయకుడు సాయిచంద్ భార్య రజనీకి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చామన్నారు. ఏపూరి సోమన్న మళ్లీ బీఆర్ఎస్ వద్దకే వచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యేగా చేసి, మంత్రిని చేశామన్నారు. స్వామిగౌడ్ ని ఎమ్మెల్సీ చేశామని.. ఎంతోమందికి గౌరవం కల్పించామని చెప్పారు కేటీఆర్.
ఉద్యమకారులకు, విద్యార్థి ఉద్యమ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసిందని.. ఇంకా చేయాలని దరువు ఎల్లన్న కోరారని.. ఆయన సూచన కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామన్నారు కేటీఆర్.
♦