మా పార్టీ విస్తరిస్తోంది.. మోదీ మాటలే నిదర్శనం
భారత్ లో ప్రధానులుగా పనిచేసిన 15మందిలో అత్యంత అసమర్థుడు, అవినీతి పరుడు, అత్యంత చేతగాని ప్రధాని మోదీయేనని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.
ప్రధాని నరేంద్రమోదీ భోపాల్ లో కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై చేసిన విమర్శలను తీవ్ర స్థాయిలో ఖండించారు మంత్రి కేటీఆర్. మోదీవి లేకి విమర్శలని అన్నారు. అవి భావదారిద్య్రపు విమర్శలు అని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లో కూడా మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని, మహారాష్ట్రలో కూడా కీలక నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని, అందుకే బీజేపీ కంగారు పడుతోందన్నారు. మోదీ వ్యాఖ్యల వెనక అదే మూలకారణం అయి ఉండొచ్చన్నారు కేటీఆర్.
బీజేపీకి తెలంగాణలో ఎప్పుడూ చోటు లేదని, అప్పుడప్పుడు పాలపొంగులా అలా కనపడుతుందని, అది వాపు అని అన్నారు కేటీఆర్. తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ తమకు ప్రత్యర్థి కాదన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 100కి పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి హడావిడి చేస్తే ఎదురుదాడి తప్పదన్నారు. నడ్డా వచ్చి అడ్డమైన గాడిద మాటలు మాట్లాడితే ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. భారత్ లో ప్రధానులుగా పనిచేసిన 15మందిలో అత్యంత అసమర్థుడు, అవినీతి పరుడు, అత్యంత చేతగాని ప్రధాని మోదీయేనని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.
కుమ్మక్కు అయింది ఎవరు..?
బీజేపీతో తమకు లాలూచీ ఎంతమాత్రం లేదన్నారు మంత్రి కేటీఆర్. మోదీని తమ పార్టీ నేతలు విమర్శించినంతగా ఇంకెవరూ విమర్శించి ఉండరన్నారు. అసలు తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు ఎప్పుడైనా బీజేపీని విమర్శించారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఉన్న మోడీ, హైదరాబాద్ లో ఉన్న బోడి, వీరిద్దరికీ అండగా ఉన్న ఈడీ.. అన్నీ కలసి తమపై దాడికి దిగినా తగ్గేది లేదనన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అదే సమయంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతల్ని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని సూటిగా ప్రశ్నించారు. అంటే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయా అని ప్రశ్నించారు. దేశంలో రెండు పెద్ద పార్టీలే ఉండాలని కాంగ్రెస్, బీజేపీ అనుకోవడం సరికాదన్నారు.