Telugu Global
Telangana

మనం వాడేది ముడి చమురా..? మోడీ చమురా..?

లీటరు పెట్రోల్ రూ.70, లీటరు డీజిల్‌ రూ.65లకే ఇవ్వాలన్నారు మంత్రి కేటీఆర్. ముడిచమురు ధరలకు తగ్గట్టుగానే మోడీచమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

మనం వాడేది ముడి చమురా..? మోడీ చమురా..?
X

గతంలో ముడి చమురు దిగుమతి చేసుకునేవారమని, కానీ ఇప్పుడు మోడీ చమురు వాడుకోవాల్సి వస్తోందని సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరగలేదు కానీ, దేశంలో మోడీ చమురు ధర భారీగా పెరుగుతోందని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన.. చమురు ధరలపై కేంద్రం దోపిడీని వారికి వివరించారు. 30లక్షల కోట్ల రూపాయలను కేంద్రం చమురుపై పన్నుల రూపంలో వసూలు చేసిందని చెప్పారు.

రాష్ట్రాలకు వాటా లేదు..

కేంద్రం తెలివిగా రాష్ట్రాలకు వాటా ఎగరగొట్టేందుకు సెస్సుల రూపంలో పెట్రోల్, డీజిల్ పై భారం మోపిందని వివరించారు మంత్రి కేటీఆర్. ఈ సెస్సులేవీ రాష్ట్రాలకు రావు కాబట్టి, మొత్తం కేంద్రం దోచుకుపోతోందని అన్నారు. అదే సమయంలో రాష్ట్రాలకు రావాల్సిన అభివృద్ధి నిధుల్ని కూడా కేంద్రం ఆపేస్తోందని, బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తోందని, తెలంగాణ లాంటి రాష్ట్రాలపై కక్షసాధిస్తోందని మండిపడ్డారు.

రేట్లు తగ్గించాల్సిందే..

2014లో మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు క్రూడాయిల్‌ ధర 94 డాలర్లుగా ఉండేదని, అదిప్పుడు 98 డాలర్లకు పెరిగింగని గుర్తుచేశారు. కానీ బీజేపీ గద్దనెక్కినప్పుడు లీటర్ పెట్రోల్ 70రూపాయలుగా ఉందని, అదిప్పుడు రూ.112కి ఎగబాకిందని చెప్పారు. ముడి చమురు ధరలో కేవలం 4డాలర్లు మాత్రమే మార్పు ఉంటే, భారత్ లో పెట్రోల్ ధర ఏకంగా 42 రూపాయలు పెరిగిందని ఇది నాలుగు రెట్లు ఎక్కువ దోపిడీ అని చెప్పారు. పెంచినవారే ధరలు తగ్గించాలని, మోదీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ పై విధించిన సెస్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లీటరు పెట్రోల్ రూ.70, లీటరు డీజిల్‌ రూ.65లకే ఇవ్వాలన్నారు. ముడిచమురు ధరలకు తగ్గట్టుగానే మోడీచమురు ధరలు తగ్గించాలన్నారు కేటీఆర్.

First Published:  23 Oct 2022 9:30 AM IST
Next Story