మోదీ ప్రియమైన ప్రధాని కాదు, పిరమైన ప్రధాని..
వన్ నేషన్ - వన్ రేషన్, వన్ నేషన్ - వన్ ట్యాక్స్ అన్న ప్రధాని ఇప్పుడు కొత్తగా వన్ నేషన్ - వన్ ఫ్రెండ్ అనే నినాదంతో అంతా అదానీకి దోచి పెడుతున్నారని చెప్పారు.
మోదీ ప్రజలకు ప్రియమైన ప్రధాని కాదని, పిరమైన ప్రధాని అని సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. ఆయన హయాంలో అన్ని వస్తువులు పిరమైపోయాయని అన్నారు. అప్పులు ఆకాశంలో ఉన్నాయని, నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయని అన్నారు. రూ.70 పెట్రోల్‌ను రూ.110 చేసి.. పప్పు, ఉప్పు, నూనె, నెయ్యి అన్నింటినీ పిరం చేశారన్నారు. మోదీ వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేదని, ఇప్పుడది 1200 రూపాయలకు చేరిందని చెప్పారు. ఈరోజు ఏది ముట్టుకున్నా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయిందని, దీనికి దుర్మార్గమైన కేంద్రమే కారణం అని అన్నారు. ఎనిమిదేళ్లలో ఏం చేశావయ్యా మోదీ అంటే చెప్పుకోడానికి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్లకు కనపడుతోందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. కేంద్రంపై నిప్పులు చెరిగారు.
స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తెచ్చి పేదలకు పంచుతానని మోదీ చెప్పారని, రూ.15లక్షలు ఎవరి ఖాతాలో పడ్డాయని ప్రశ్నించారు. ఆ పైసలన్నీ ఆయన దోస్తు ఖాతాలో వేశారని చెప్పారు. వన్ నేషన్ - వన్ రేషన్, వన్ నేషన్ - వన్ ట్యాక్స్ అన్న ప్రధాని ఇప్పుడు కొత్తగా వన్ నేషన్ వన్ ఫ్రెండ్ అనే నినాదంతో అంతా అదానీకి దోచి పెడుతున్నారని చెప్పారు. శ్రీలంకలో ప్రభుత్వం పేరుతో అదానీకి కాంట్రాక్ట్ లు ఇప్పించారని, అక్కడ వచ్చిన సొమ్ముని బీజేపీ ఖాతాలకు మళ్లించారని, వాటితోనే వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనేసి, ప్రభుత్వాలను కూలదోశారని మండిపడ్డారు.
ఎర్రబెల్లి దయాకరరావు అత్యుత్తమ మంత్రి అని కొనియాడారు మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డులు ప్రకటించినా ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖకే రావడం గర్వకారణమన్నారు. ఆయనకు ఈసారి రికార్డ్ మెజార్టీ రావాలని, మెజార్టీలో సిరిసిల్లతో పాలకుర్తి వాసులు పోటీ పడాలన్నారు.