Telugu Global
Telangana

కాంగ్రెస్ కి వారంటీ అయిపోయింది.. వాళ్లిచ్చే గ్యారెంటీలకు దిక్కెక్కడిది..?

కాంగ్రెస్ పార్టీకి 11సార్లు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, కానీ ఫలితం ఏంటని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. ఈ 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని నాశనం చేసేందుకే మళ్లీ వారు అధికారంలోకి రావాలనుకుంటున్నారని చెప్పారు.

కాంగ్రెస్ కి వారంటీ అయిపోయింది.. వాళ్లిచ్చే గ్యారెంటీలకు దిక్కెక్కడిది..?
X

65 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులు, ఇప్పుడు ఇంకో అవకాశమిస్తే చేస్తారా అని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. అలాంటి పార్టీని నమ్మి మోసపోతామా అని ప్రజల్ని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ పార్టీకే వారంటీ తీరిపోయిందని, అలాంటి పార్టీ ఇచ్చే గ్యారెంటీలకు దిక్కెక్కడిదని అన్నారు. ఆ దిక్కుమాలిన పార్టీకి మరోసారి ఓటు వేస్తే, అర్థరాత్రి రైతులకు కరెంటు కట్ చేస్తారని, మంచినీటికోసం కుళాయిల వద్ద కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, రైతులు.. ఎరువులు, విత్తనాలకోసం పోలీస్ స్టేషన్ ముందు లైన్లు కట్టాల్సి వస్తుందన్నారు. ఏడాదికి ఒక ముఖ్యమంత్రి రావడం గ్యారెంటీ అని, ఐదేళ్లకు ఐదుగురు కృష్ణులు ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో వస్తారన్నారు. ఆ మొండిచేయికి ఓటు వేస్తే విద్య, వైద్యం వెనకకు పీకుతాయన్నారు కేటీఆర్.


అమ్మకు అన్నం పెట్టనోడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టుగా.. కాంగ్రెస్ హామీలు ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. చత్తీస్ ఘడ్ లో పింఛన్లను 4వేలరూపాయలకు పెంచొచ్చుకదా అని ప్రశ్నించారు. రాజస్థాన్ లో పింఛన్లు పెంచడం చేతకాదని, కర్నాటకలో కూడా పింఛన్లు పెంచరని, కానీ అధికారం కోసం తెలంగాణలో పింఛన్లు పెంచుతామంటున్నారని ఈ మోసాన్ని అందరూ గ్రహించాలన్నారు కేటీఆర్.


కాంగ్రెస్ పార్టీకి 11సార్లు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, కానీ ఫలితం ఏంటని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. ఈ 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని నాశనం చేసేందుకే మళ్లీ వారు అధికారంలోకి రావాలనుకుంటున్నారని చెప్పారు. ఆ అభివృద్ధి అంతా నాశనం అయిపోతుందని, మొండిచేయిని నమ్మొద్దని ప్రజల్ని కోరారు. అప్పట్లో శిలాఫలకాలు మాత్రమే వేసేవారని, కానీ కేసీఆర్ హయాంలో పనులు జరుగుతున్నాయని చెప్పారు కేటీఆర్. తొమ్మిదేళ్లలో తెలంగాణలో జరిగిన పనులు, దేశంలో ఇంకెక్కడైనా జరిగాయా అని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.

First Published:  27 Sept 2023 7:10 PM IST
Next Story