Telugu Global
Telangana

ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నాం – కేటీఆర్

మిషన్ భగీరథ ద్వారా నీటి లభ్యత పెరిగిందని, తద్వారా సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని చెప్పారు కేటీఆర్. చివరకు తెలంగాణ ధాన్యాన్ని కొనలేమని కేంద్రం చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందన్నారు.

ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల్ని ప్రోత్సహిస్తున్నాం – కేటీఆర్
X

తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు మంత్రి కేటీఆర్. ఆయిల్ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావాలన్నారు. రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ లో జరుగుతున్న వెజ్‌ ఆయిల్‌, ఆయిల్‌ సీడ్స్.. గ్లోబల్‌ రౌండ్ టేబుల్‌ సదస్సుకు మంత్రి నిరంజన్ రెడ్డితో కలసి కేటీఆర్ హాజరయ్యారు.

ధాన్యం ఉత్పత్తి పెరిగింది..

తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని అన్నారు మంత్రి కేటీఆర్‌. మిషన్ భగీరథ ద్వారా నీటి లభ్యత పెరిగిందని, తద్వారా సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని చెప్పారు. చివరకు తెలంగాణ ధాన్యాన్ని కొనలేమని కేంద్రం చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టిసారించారని, అధిక ఆదాయం ఇచ్చే ఇతర పంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే రైతులను ప్రోత్సహిస్తోందని వివరించారు.

లైఫ్ సైన్సెస్ లో నెంబర్-1 హైదరాబాద్..

ప్రపంచానికి హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌ గా మారిందని అన్నారు మంత్రి కేటీఆర్‌. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో నగరం పురోగమిస్తోందని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్‌ లో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయని వెల్లడించారు. టీఎస్‌ ఐపాస్‌ తో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులను సులభతరం చేశామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పరిశ్రమలకు సులభంగా అనుమతులు లభిస్తున్నాయని, 15 రోజుల్లోనే అనుమతుల అభ్యర్థనలను పరిశీలించి మంజూరు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో అమెజాన్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు 11 రోజుల్లోనే అన్నిరకాల పర్మిషన్లు ఇచ్చామని గుర్తు చేశారు.

ఎనిమిదేళ్లలో తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ 24 శాతం పెరిగిందంటున్న కేటీఆర్, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకే గర్వకారణంగా మారిందన్నారు. వ్యవసాయానికి పూర్తి అనుకూల పరిస్థితులు ఉండటంతో దిగుబడి పెరిగిందని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలతో తెలంగాణ రైతాంగం మంచి ఫలసాయాన్ని అందుకోవడమే తమ ముందున్న లక్ష్యమని వివరించారు. ఆయిల్ పామ్ పంటల సాగులో తెలంగాణ రైతులు మరిన్ని అద్భుతాలు సృష్టించాలన్నారు.

First Published:  18 Nov 2022 2:19 PM IST
Next Story