ఇన్ని అబద్ధాలా కిషన్ రెడ్డీ..!
కిషన్ రెడ్డిని తానెప్పూడు సోదర సమానుడిగా గౌరవిస్తానని, కానీ ఆయన ఇంత అబద్ధాలకోరు అనుకోలేదని చెప్పారు కేటీఆర్.
దేశవ్యాప్తంగా మోదీ సర్కారు 90 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని, అందులో తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఇంతకంటే తప్పుడు సమాచారం ఇంకోటి ఉండదన్నారు. ఇలాంటి కేంద్ర మంత్రిని తానింతవరకూ చూడలేదని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డిని తానెప్పూడు సోదర సమానుడిగా గౌరవిస్తానని, కానీ ఆయన ఇంత అబద్ధాలకోరు అనుకోలేదని చెప్పారు. కనీసం ఇప్పటికైనా ఈ తప్పుల్ని సరిదిద్దుకోవాలని తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదన్న సత్యాన్ని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. అది అబద్ధం అని, కనీసం క్షమాపణలు చెప్పేంత ధైర్యం కూడా కిషన్ రెడ్డికి లేదని అన్నారు కేటీఆర్.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయడంలేదని నిలదీశారు కేటీఆర్. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణకు కానీ, సోదర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కి కానీ మేలు కూడా జరగలేదన్నారు. ఆ హామీలను నిలబెట్టుకోలేకపోవడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పారు కేటీఆర్. బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని చెప్పడం కేంద్రం అసమర్థకు నిదర్శనం అని అన్నారు కేటీఆర్. పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని మోదీ సర్కారు ఏమాత్రం గౌరవించడంలేదన్నారు కేటీఆర్.
ఎవర్ని సంతృప్తి పెట్టడానికి..?
తెలంగాణ నుంచి మంత్రిగా ఎదిగిన కిషన్ రెడ్డి ఈ ప్రాంతానికి న్యాయం చేయలేకపోతున్నారని, గుజరాత్ లోని తన బాస్ లను సంతృప్తి పరచడానికి ఆయన పనిచేస్తున్నారని అన్నారు కేటీఆర్. కిషన్ రెడ్డి చెప్పేవన్నీ అసత్యాలేనని చెప్పారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికే కేంద్రంలో కిషన్ రెడ్డి పదవిలో ఉన్నారని చెప్పారు కేటీఆర్. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తప్పుడు ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. కాలేజీలు మంజూరు చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాలేజీలను తమ ఖాతాలో వేసుకోవాలనుకోవడం కేంద్రం దౌర్భాగ్యం అని విమర్శించారు.