కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్ - కేటీఆర్
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 28 శాతం రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పారు కేటీఆర్. రెండు రోజుల క్రితమే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఇందుకు సంబంధించిన రిపోర్టు ఇచ్చిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ పడిపోవడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రముఖ మీడియా సంస్థ టీవీ-9 నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో ముఖ్యమంత్రి మారడం ఖాయమని, దీంతో పాలసీలు అమలు చేయడం కష్టంగా మారుతుందన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 28 శాతం రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పారు కేటీఆర్. రెండు రోజుల క్రితమే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఇందుకు సంబంధించిన రిపోర్టు ఇచ్చిందన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వైపు చూడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. టికెట్ల కోసం కూడా ఢిల్లీకి పరుగులు పెట్టారని గుర్తుచేశారు కేటీఆర్.
ఇంతకీ వెస్టియన్ రిపోర్టు ఏం చెప్పిందంటే..
జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 28 శాతం క్షీణించిందని తెలిపింది. దీంతోపాటు మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ఆఫీస్ స్పేస్ సైతం 25 శాతం పడిపోయి 27 లక్షల చదరపు అడుగుల వద్దే ఉందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో హైదరాబాద్‌లో ఈసారి 37 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్, 55 లక్షల్లో కొత్త ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చిందని రిపోర్టు వెల్లడించింది. గతేడాదితో పోల్చితే లీజులు ఏకంగా 270 శాతం, కొత్త సప్లయ్ 175 శాతం వృద్ధి చెందిందని స్పష్టం చేసింది.