నా జీవితంలో ఒక్క ఎన్నికలో కూడా డబ్బు, మందు పంచలేదు
తనతో పోటీపడాలనుకునేవారు చాలమంది ఉన్నారని, వారంతా తాను చేసే మంచి పనులకు పోటీగా రెండు పనులు ఎక్కువ చేస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అన్నారు కేటీఆర్. అంతేకాని సిరిసిల్లలో ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు, మందు పంచిపెట్టే సంస్కృతి తేవొద్దని హితవు పలికారు.
నన్ను ఎన్నికల్లో ఢీకొట్టాలంటే డబ్బులు పంచిపెట్టొద్దు, ఓటర్లకు మందు పోయించొద్దు, నాకంటే ఒక మంచిపని ఎక్కువచేయండి చాలు, ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారంటూ సూచించారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద విద్యార్థులకు కేటీఆర్ ట్యాబ్ లు పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా గతంలో సిరిసిల్లకు 6 అంబులెన్సులు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 120 అంబులెన్సులు సమకూరాయని చెప్పారు. దివ్యాంగుల కోసం 1200 ట్రై మోటార్ సైకిళ్లు అందించామని చెప్పారు. ప్రస్తుతం పేద విద్యార్థులకు ట్యాబ్స్ అందిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా 6 వేల మంది ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తున్నట్టు తెలిపారు.
ఎన్నికల్లో పోటీ సమయంలో ఎవరెవరు ఏం చేస్తుంటారో తనకు తెలుసని, చాలామంది మందు పోయిస్తుంటారని, డబ్బులు పంచిపెడుతుంటారని, కానీ తన జీవితంలో తానెప్పుడూ ఎన్నికల్లో డబ్బు పంచి పెట్టలేదని చెప్పారు మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరేనని అన్నారు. ఒళ్లు వంచి పనిచేయాలని, కష్టపడి మంచి చేయాలని అప్పుడే ఎన్నికల్లో గెలుస్తారని, డబ్బులు పంచితే గెలవరని అన్నారు కేటీఆర్. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే దరిద్రపు పని తానెప్పుడూ చేయలేదని, చేయబోనని చెప్పారు. తనతో పోటీపడాలనుకునేవారు చాలమంది ఉన్నారని, వారంతా తాను చేసే మంచి పనులకు పోటీగా రెండు పనులు ఎక్కువ చేస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. అంతేకానీ సిరిసిల్లలో ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు, మందు పంచిపెట్టే సంస్కృతి తేవొద్దని హితవు పలికారు కేటీఆర్.
మీ ఓపిక, మీ పట్టుదల..
విద్యార్థుల చదువు, భవిష్యత్తుకోసం తెలంగాణ ప్రభుత్వం కంటే ఎవరూ ఎక్కువగా చేయలేరని చెప్పారు కేటీఆర్. కొత్త ఆలోచనలతో పైకి ఎదగాలనే తపన ఉన్న విద్యార్థులకు కచ్చితంగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని చెప్పారు. విదేశాల్లో విద్యనభ్యసించే వారికోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద రూ.20 లక్షలు ఇచ్చే ప్రభుత్వం కేవలం తెలంగాణ సర్కారేనని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఓపిక, పట్టుదల ఉంటే.. వారు ఏ స్థాయికి వెళ్తామన్నా తెలంగాణ ప్రభుత్వం తరపున మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ట్యాబ్ లను సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబ సభ్యులకోసం కూడా వాటిని వినియోగించాలని, అదనపు జ్ఞాన సముపార్జనకోసం ఉపయోగించాలని సూచించారు.