Telugu Global
Telangana

పనిచేసే నాయకులనే ప్రోత్సహించాలి..

సీఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఒకరన్నారు. చీమకు కూడా హాని చేయని మనస్తత్వం ఆయనదని చెప్పారు.

పనిచేసే నాయకులనే ప్రోత్సహించాలి..
X

తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. పనిచేసే నాయకులను ప్రోత్సహించాలని, అది ప్రజల బాధ్యత అన్నారు. రైతుబీమా పెట్టి రైతులకు ధీమానిచ్చింది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. రైతులకోసం, ఈ ప్రాంత బాగుకోసం సీఎం కేసీఆర్ కష్టపడ్డారని గుర్తు చేసారు. తొమ్మిదిన్నరేళ్లలో ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు.. వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. 111 జీవోని ఎత్తివేస్తామని గత ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గంలో హామీ ఇచ్చామని, దాన్ని నెరవేర్చామని చెప్పారు కేటీఆర్.


ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటు పడుతున్న చేవెళ్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలె యాదయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఒకరన్నారు. చీమకు కూడా హాని చేయని మనస్తత్వం ఆయనదని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లలో ఇక్కడ ఎలాంటి పంచాయితీ లేదని, కక్షలకు తావులేదని చెప్పారు. అందర్నీ కలుపుకొని వెళ్తున్న ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయుధాల సరఫరా కేసులో నిందితుడని చెప్పారు కేటీఆర్. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌ లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.

చేవెళ్ల నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో ఉందని చెప్పారు మంత్రి కేటీఆర్. కల్యాణ్ లక్ష్మిలాగే ఈసారి సౌభాగ్యలక్ష్మి పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రతి ఆడబిడ్డకు పెన్షన్ ఇస్తామన్నారు. ఆసరా పెన్షన్లు పెంచబోతున్నట్టు చెప్పారు. గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గిస్తున్నామని అన్నారు కేటీఆర్. పనిచేసే నాయకులను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

First Published:  16 Nov 2023 1:49 PM GMT
Next Story