Telugu Global
Telangana

ఇక సహాయక చర్యలపై దృష్టిపెట్టాలి -కేటీఆర్

నీటిద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై కూడా ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో ముందుకు పోదామని అధికారులకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.

ఇక సహాయక చర్యలపై దృష్టిపెట్టాలి -కేటీఆర్
X

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా మెరుగుపరచాలన్నారు. నీటిద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై కూడా ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో ముందుకు పోదామని అధికారులకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.

అధికారులు, సిబ్బందుల సెలవలు మరికొన్ని రోజులు రద్దులోనే ఉంటాయని చెప్పిన ఆయన, ఎట్టి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలన్నారు. చెరువులన్నీ పూర్తిగా నిండాయని, వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, సాగునీటి శాఖతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు వాటిని కొంత ఖాళీ చేయించాలన్నారు. సహాయ కార్యక్రమాల సమన్వయం కోసం హైదరాబాద్ తో పాటు ప్రతి జిల్లాలో కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


రహదారుల పునరుద్ధరణ..

పట్టణాల్లో ప్రధాన రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు కేటీఆర్. తాత్కాలిక మరమత్తులు వెంటనే మొదలు పెట్టాలని, ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుధ్య డ్రైవ్ ని చేపట్టాలన్నారు. అవసరమైతే తాత్కాలికంగా అదనపు సిబ్బందిని, అదనపు వాహనాలను సమకూర్చుకోవాలన్నారు.

తాగునీటికి ప్రాధాన్యం..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీరును అందించాలని చెప్పారు మంత్రి కేటీఆర్. ప్రజలు తాగునీటిని కాచి వడపోసుకొని వినియోగించాలని, ఈమేరకు వారికి అవగాహన కల్పించాలన్నారు. సురక్షిత తాగునీరు సరఫరా కోసం మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని పైపులైన్ల లీకేజీలు వెంటనే మరమ్మతులు చేయడం, క్లోరినేషన్ వంటి కార్యక్రమాలను వేగంగా చేపట్టాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. భారీ వర్షాలకు చాలాచోట్ల పురాతన భవనాలు కూలిపోయే దశకు చేరుకున్నాయని, అలాంటివాటిని గుర్తించి యజమానుల సహకారంతో వాటిని తొలగించాలని, ఎవరూ అలాంటి భవనాల్లో నివశించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి కేటీఆర్.

First Published:  29 July 2023 9:52 PM IST
Next Story