బీజేపీ వాళ్లందరూ సత్య హరిశ్చంద్రుడి కజిన్సా.. మనీశ్ సిసోడియా అరెస్టుపై స్పందించిన కేటీఆర్
బీజేపీ అసమర్థ విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న నేతలను రాజకీయంగా ఎదుక్కోలేక నీచంగా వ్యవహరిస్తున్నదని.. ప్రశ్నించిన వారిని అవినీతిపరులుగా చిత్రీకరిస్తున్నదని కేటీఆర్ అన్నారు.
బీజేపీ నాయకులు, బంధువులు, స్నేహితులపై గత 8 ఏళ్లలో ఎందుకు ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగలేదు? బీజేపీ వాళ్లు ఏమైనా రాజా సత్య హరిశ్చంద్ర కజిన్సా లేదా బంధువులా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన తర్వాత ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. పీఎం మోడీ సన్నిహితులను ఎలా రక్షిస్తున్నారో ఈ దేశమంతా గమనిస్తోందని అన్నారు. ఒకవైపు వారి అనుచరులను రక్షించుకుంటూ.. ప్రతిపక్ష నాయకులను మాత్రం ఎలా వేటాడుతున్నారో చూస్తున్నారని చెప్పారు.
ప్రతిపక్ష పార్టీలను ఎలాగైనా వేధింపులకు గురి చేయడమే పీఎం మోడీ లక్ష్యమని అన్నారు . ఒక వేళ ప్రతిపక్షాలు లొంగకపోతే పార్టీని చీల్చి.. లేదంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఎన్నికైన ప్రభుత్వాలను కుప్పకూల్చడం ఆయన పని విధానం అని మండిపడ్డారు. అప్పటికీ తాము అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థల ద్వారా వేధింపులకు గురి చేస్తారని.. వాటి ఆధారంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల పరువు తీయడానికి సిద్ధపడతారని అన్నారు. ఈ చర్యలకు వాళ్ల పెయిడ్ ట్రోల్ ఆర్మీ మద్దతు ఉంటుందని కేటీఆర్ దుయ్యబట్టారు.
బీజేపీ అసమర్థ విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న నేతలను రాజకీయంగా ఎదుక్కోలేక నీచంగా వ్యవహరిస్తున్నదని.. ప్రశ్నించిన వారిని అవినీతిపరులుగా చిత్రీకరిస్తున్నదని కేటీఆర్ అన్నారు. దేశ ప్రజాస్వామ్యానికి ఈ చర్యలు గొడ్డలి పెట్టుగా మారాయని.. ప్రజా బలంతో ఎదుర్కోలేక కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ద్వారా చీవాట్లు తినడమే కాకుండా పరాజయాన్ని కూడా ఎదుర్కున్నది. దీన్ని సహించలేకే సిసోడియాను అరెస్టు చేయించిందని కేటీఆర్ ఆరోపించారు.
బీజేపీ చేస్తున్న నీతి బాహ్యమైన, దుర్మార్గ రాజకీయాలను దేశం గమనిస్తోంది.. ఈ కుట్ర రాజకీయాలను ప్రజలే తిప్పికొడతారని కేటీఆర్ చెప్పారు. భవిష్యత్‌లో బీజేపీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిందని.. తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర పన్ని భంగపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అప్రజాస్వామిక, దుర్మార్గపూరిత కుట్రలకు కాలం దగ్గర పడిందని కేటీఆర్ అన్నారు.
Modi’s Operandi is clear
— KTR (@KTRBRS) February 26, 2023
Target opposition parties by all means at his disposal; Either split the parties Or poach their MLAs & dislodge elected Governments
If nothing works, use their only allies; CBI, ED & IT to harass and launch a smear campaign
Back it with Paid Troll Army